సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న వ్యక్తులను మనం చాలామందినే చూస్తుంటాం. కానీ అలా వ్యవసాయాన్నే జీవనోపాధిగా మార్చుకొని అందులో అవార్డులను కూడా సాధించే స్థాయికి చేరుకునే వారు అరుదనే చెప్పాలి.
అలాంటి వ్యక్తే కరీం నగర్ కి చెందిన మవురం మల్లికార్జున్ రెడ్డి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా హైదరాబాద్ లో జీవితం, పెద్ద జీతం వదులుకొని కరీంనగర్ జిల్లాలోని పెద్ద కుమ్మరిపల్లి గ్రామంలోని తన పొలంలో వరి, కూరగాయలు, ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా మంచి లాభాలను సాధిస్తున్నాడీ రైతు. తాజాగా ఆయన వ్యవసాయంలో చేసిన కొత్త ప్రయోగాలను గుర్తించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ (ICAR) సంస్థ ఆయనకు అవార్డును కూడా అందించింది. ఈ అవార్డు సాధించిన మొదటి తెలంగాణ వ్యక్తి మల్లికార్జున్ కావడం విశేషం. దీంతో పాటు ఆయనకు మరో ఎనిమిది అవార్డులు కూడా దక్కాయి. ఇవన్నీ ఆయన కొనసాగిస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులను మెచ్చి అందించినవే. అసలు ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలన్న ఆలోచన గురించి అడిగితే దాని వెనుక ఉన్న కథను వివరిస్తారు మల్లికార్జున్.
2014 సంవత్సరంలో మల్లికార్జున్ దగ్గరి బంధువు ఒక క్యాన్సర్ బారిన పడి మరణించారు. అప్పటివరకు వారి కుటుంబంలో తాత ముత్తాతల నుంచి బంధువుల్లో ఎవరికీ క్యాన్సర్ వ్యాధి లేదు. దీంతో ఇది ఎలా వచ్చిందన్న విషయంపై వైద్యులను ప్రశ్నించిన మల్లికార్జున్ కి ఆశ్చర్యపోయే సమాధానాలు ఎదురయ్యాయి. ఆ వ్యక్తి రోజూ తీసుకునే ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చిందని తెలుసుకున్నాడు. కెమికల్ ఎరువులు వేసి పండించిన ఆహారం తిని ప్రతి ఒక్కరి శరీరాన్ని నాశనం చేస్తున్నాయని భావించిన అతడు తన కుటుంబానికి మాత్రం ఇలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని భావించాడు. ఉద్యోగాన్ని మానేసి తనకున్న 13 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఎంబీయే చేసి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన భార్య సంధ్య కూడా ఆయనకు ప్రోత్సాహాన్నిచ్చింది. దీంతో తన పొలంలో ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించాడు.
ప్రస్తుతం ఆయన ఆర్గానిక్ జీరో వేస్ట్ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తన పొలంలో 26 వెరైటీల వరి రకాలతో పాటు కూరగాయలు, ఔషధ మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఇందులో కొంగొత్త పద్ధతులను పాటిస్తూ ఏటా పదహారు లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ మేం మా పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆహారాన్ని అందించాలనుకున్నాం. మా బంధువుకి క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడే నా భార్య గర్భం దాల్చింది. మా భవిష్యత్ తరాల కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ముందు కొద్దిగా వరి పండించడం ప్రారంభించి ఆ తర్వాత కొద్దికొద్దిగా ఈ విస్తీర్ణాన్ని పెంచుతూ పోయాం. తర్వాత వివిధ వరి వెరైటీలను పండించడం ప్రారంభించాం. ఆపై అలసందలు, అల్లం, నువ్వులు. వేరు శనగ వంటి వాటితో పాటు వసాక లాంటి ఔషధ మొక్కలు కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం తనకున్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని 20 ఎకరాల్లో పండిస్తున్నారు.
దీని గురించి ఆయన చెబుతూ నేను ప్రతి సీజన్ లో ఎకరానికి 42 క్వింటాళ్ల వరి పండిస్తాను. ఇది సాధారణం కంటే 10 నుంచి 12 శాతం ఎక్కువ. ఇందుకోసం నేను ధాన్యాన్ని జల్లి మొలకలు వచ్చాక నాటే సాధారణ పద్ధతిని కాకుండా విత్తనాలు నాటే పద్ధతినే పాటిస్తాను. ఇలా నేరుగా నాటడం వల్ల తక్కువ విత్తనాలను ఉపయోగించవచ్చు. నేను ఎకరానికి కేవలం 5 కిలోల విత్తనాలను ఉపయోగిస్తాను. అదే సాధారణ పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోలు అవసరమవుతుంది. తద్వారా నేను ఖర్చును ఐదు రెట్లు తగ్గించుకుంటున్నాను. ఈ పద్ధతిలో 12 నుంచి 25 వేల వరకు ఖర్చు చేసి విత్తనాలను నాటే వీలు కలుగుతుంది. అంతే కాదు.. ఒకే పొలంలో నాలుగైదు రకాల పంటలను ఉపయోగించే ఆయన ఈ పద్ధతి వల్ల మొక్కల్లో పోషకాలు పెరగడం, తద్వారా పెరుగుదల వేగంగా జరగడం గమనించానని చెబుతున్నారు.
వీటితో పాటు వాన నీటిలో ఓ కుంటగా ఏర్పాటు చేసి అందులో చేపలను కూడా పెంచుతున్నారు. గొర్రెలు, కోళ్లు, మేకలు, గేదెలు ఇతర జంతువులను కూడా పెంచుతూ సహజమైన ఎరువులను సిద్ధం చేస్తున్నారు. జీవామ్రుత్, వేప కషాయం లాంటి ఆర్గానిక్ మందులు, ఎరువులనే ఉపయోగిస్తానని కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఐటీ ఉద్యోగంలో సంవత్సరానికి నాలుగు లక్షలు సంపాదించేవాడిని. ఇప్పుడు దానికి నాలుగు రెట్లు సంపాదిస్తున్నాను. ఇక్కడ నేను ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు పన్నెండు గంటల కంటే ఎక్కువగా పనిచేస్తాను. నా పనిలో ఎక్కువ భాగం నేనే ఒంటరిగా పూర్తి చేస్తాను. దీనివల్ల నేను ఆరు కేజీల బరువు కూడా తగ్గాను. మొదట్లో నేను అనుకున్నంత ఫలితం రాలేదు. అప్పుడు వ్యవసాయ అధికారులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని సుభాష్ పాలేకర్, రాజీవ్ దీక్షిత్ లాంటివారి సలహాలు పాటించాను. ఇప్పుడు అందులో ఫలితం సాధిస్తుంటే చాలామంది సలహాల కోసం వస్తున్నారు. వారికీ నాకు తెలిసిన విషయాలను వెల్లడిస్తున్నాను. ఇకపై గడ్డి జాతులు, పప్పు ధాన్యాలు, వంటివాటిపై కూడా ప్రయోగాలు చేసి వాటిని కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనుకుంటున్నా. అని చెప్పారు. మొదట్లో తనని అంతా చులకనగా చూసినా తన భార్య సహకారంతో ముందుకు సాగానని.. ఇప్పుడు వారే తనని అభినందిస్తున్నారని వెల్లడించాడు.
Share your comments