సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగు రైతులకు లాభాల పంట పండిస్తోంది. పరిమళాలు వెదజల్లే లిల్లీ పూలను అలంకరణలోను,బొకేలు, సుగంధ తైలాలు ఉత్పత్తిలోనూ అధికంగా వినియోగిస్తారు. దాంతో లిల్లీ పూలు వాణిజ్యపరంగా ప్రపంచ మార్కెట్లో సైతం అన్ని కాలాల్లో నిలకడైన ధర లభిస్తుండడం వల్ల చాలా మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
సాధారణంగా లిల్లీ పూలను సంపంగి పూలు అని కూడా పిలుస్తారు వీటిని దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూలలో సింగిల్, సెమిడబుల్, డబుల్ మరియు వెరిగేటెడ్ అనే రకాలు కలవు. వీటిలో ముఖ్యంగా వాణిజ్య సాగుకు అనువైన లిల్లీ రకాల్లో హైదరాబాద్ సింగిల్ ప్రజల్, కలకత్తా సింగిల్, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్ -సహాసిని వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొంది అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
లిల్లీపూల సాగుకు అనువైన వాతావరణం:
లిల్లీ పూలు సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో చక్కగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. వీటికి వెలుతురు బాగా ఉండి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలు చక్కటి అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే పూల నాణ్యత బాగా తగ్గుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు మంచు పడే ప్రదేశాలు వీటి సాగుకు అసలు పనికిరావు.
లిల్లీ పూల సాగుకు అనుకూలమైన నేలలు:
అధిక సేంద్రియ పదార్ధం కల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల,ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక (పి.హెద్ )6.6-7.0 వరకూ ఉన్న నేలలో అధిక దిగుబడి పొందవచ్చు. ప్రధాన పొలంలో నీరు నిలువకుండా మురుగు నీటి వసతి కల్పించాలి లేకుంటే అనేక రకాల వ్యాధులు వ్యాపించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
Share your comments