Agripedia

పంట సీజన్ల గురించి మీకోసం..

KJ Staff
KJ Staff

సాధారణంగా రైతులు వివిధ సీజన్లలో వివిధ రకాల పంటలు వేస్తూ ఉంటారు. మనకు కూడా ఈ సీజన్ కి ఈ పంటకి ధర పెరిగింది అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. అసలు ఈ పంట సీజన్ అంటే ఏంటి? ఏ సీజన్ లో ఏ పంట వేస్తారు అన్న వివరాలు మీకు తెలుసా? మన దేశంలో వ్యవసాయం చాలామందికి ప్రధాన ఆదాయం. దాదాపు 70 శాతానికి పైగా దీనిపైనే ఆధారపడి ఉన్నారు. మన దేశంలో వ్యవసాయం మొత్తంగా వాతావరణం, నేల రకాలను ఆధారపడుతూ ఉంటాయి. ఇందులో పంటల రకాలు ఏంటంటే.

ఖరీఫ్ పంట

ఖరీఫ్ పంట అంటే వర్షా కాలంలో పెంచే పంట అని చెప్పుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో ఈ పంటలను వేసి.. వర్షాకాలం పూర్తయిన తర్వాత వీటిని కోస్తారు. అంటే జూన్, జులైలో పంటలు వేసి సెప్టెంబర్, అక్టోబర్ లో పంటలు కోయడం జరుగుతుంది. ఈ పంటలకు నీటి వసతి చాలా ఎక్కువగా ఉండాలి. ఇవి నీళ్లు ఎక్కువగా అవసరమయ్యే పంటలు. కాస్త వాతావరణం వేడిగా ఉండాలి. ఇలాంటప్పుడే ఈ పంటలు బాగా పండుతాయి. ఈ సీజన్ లో ఎక్కువగా వరి, మొక్క జొన్న, సోయా బీన్, పత్తి, చిరు ధాన్యాలు, కందులు వంటివి ఎక్కువగా పండిస్తారు. ఈ సీజన్ లో ఎక్కువగా వరి పండిస్తారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వరి పండించే దేశాల్లో చైనా తర్వాత ఉన్న దేశం మనదే. ప్రపంచంలో 20 శాతం జనాభాకు సరిపడ వరిని మన దేశం పండిస్తుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఇది పండుతుంది. 25 డిగ్రీల ఎండ, 100 సెంమీ వర్షపాతం దీనికి అవసరం. నీరు ఎక్కువగా ఉన్న చోట్ల ఇది పండుతుంది. కోస్తా తీరాలు, ఈశాన్య రాష్ట్రాలు వరి ఎక్కువగా పండించే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు.

రబీ సీజన్

రబీ అనే పదం అరబిక్ నుంచి తీసుకున్నది. ఇది చలికాలంలో పండించే పంట. అక్టోబర్ నుంచి ఈ పంటలు వేయడం ప్రారంభిస్తారు. ఏప్రిల్ లేదా మే లో ఇవి కోతకు వస్తాయి. ఇవి కాస్త వేడి వాతావరణాన్ని తట్టుకునే పంటలు అయితే శీతాకాలంలో వచ్చే వానలు ఈ పంటను నాశనం చేస్తుంటాయి. ఈ కాలంలో ఎక్కువగా గోధుమ, పప్పులు, బార్లీ, బఠానీలు,ఓట్స్, ఆవాలు వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. గోధుమ పంటలో కూడా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మన దేశం. వ్యవసాయంలో ఎక్కువగా వచ్చే ఆదాయం కూడా ఈ పంట నుంచే వస్తుంది. ఉత్తరాదిలో ఎక్కువగా గోధుమలు ఆహారంగా తీసుకుంటారు. 14 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 50 నుంచి 90 సెంమీ ల వర్షం దీనికి అవసరం అవుతుంది. అయితే కోతకు ముందు గోధుమ పంటకు వేడి ఎక్కువగా తగలాల్సి ఉంటుంది. మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ ఎక్కువ గోధుమలను పండిస్తుంది. ఆ తర్వాత హర్యానా, పంజాబ్ లు ఉన్నాయి.

జియాద్ సీజన్

రబీ సీజన్ పూర్తయ్యాక ఖరీఫ్ సీజన్ మొదలయ్యే లోపు పండించే పంటలు ఇవి. వీటిని ఎక్కువగా మార్చి నుంచి జూన్ మధ్యలో పండిస్తారు. వీటికి వేడి ఎక్కువగా పొడి వాతావరణం ఉండాలి. ఈ తరహా పంటలు రైతులకు చాలా తొందరగా డబ్బును అందిస్తాయి. ఈ సమయంలో కీర దోస, గుమ్మడి కాయ, కాకర కాయ, పుచ్చకాయ, తర్బూజా, చెరుకు, వేరు శనగ, పప్పు ధాన్యాలు వంటివి వేస్తారు.

సాధారణంగా పంటలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

క్యాష్ క్రాప్స్

ఇవి డబ్బు కోసం పండించే పంటలు. వాణిజ్య పంటల కేటగిరిలోకి వస్తాయి. వీటి వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ పంటలను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్ కూడా చేస్తారు.

ఫుడ్ క్రాప్స్

ఇవి ఆహారం కోసం పండించే పంటలు. ఇతరుల ఆకలిని తీర్చేందుకు వీటిని పండిస్తారు.

క్రాప్ రొటేషన్

ఒకటే పంట పొలంలో వివిధ రకాల పంటలను పండించే పద్ధతిని క్రాప్ రొటేషన్ అంటారు. ఇందులో భాగందగా ఒక సంవత్సరం మొక్క జొన్న, ఆవాలు పండిస్తే మరో సంవత్సరం గోధుమ లేదా వరి పండించాలి. ఇది నేల సారాన్ని కాపాడేందుకు తోడ్పడుతుంది. కెమికల్ ఫర్టిలైజర్ల అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. పురుగులు, పిచ్చి మొక్కలను తగ్గిస్తాయి. చాలా పంటలు నేల సారాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. అయితే పంటలు వేయడం ప్రతి ప్రాంతానికి వేరుగా ఉంటుంది. వాతావరణాన్ని బట్టి అక్కడి పంటలు ఉంటాయి. ఉదాహరణకు కేరళలో వర్షాకాలం ముందుగా ప్రారంభమవుతుంది. అయితే మిగిలిన దేశమంతా ఒక నెల ఆలస్యంగా వస్తుంది. అక్కడ పంటలు పండించడం కూడా దానిపై ఆధారపడి ఉంటుంది.

పత్తి సాగులో కలుపు నివారణ, అంతరకృషి యాజమాన్య పద్ధతులు...

Share your comments

Subscribe Magazine