Agripedia

పాత చీరలతో సరికొత్తగా పంట.. ఏం చేశారంటే?

KJ Staff
KJ Staff

మన పంట పొలాలలో ఎక్కువగా కలుపుమొక్కలు పడకుండా, నీటి తేమ ఆరిపోకుండా, నీటి వాడకాన్ని తగ్గించడం కోసం,అదే విధంగా ఎక్కువ వానలు వచ్చి మట్టి కొట్టుకొని పోయి భూమి సారవంతం క్షీణించకుండా ఉండడం కోసం మన పంట పొలాలలో చాలామంది మల్చింగ్ కడుతూ ఉంటారు. ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతి. ప్రస్తుత కాలంలో ప్రకృతి సేద్యం చేసే రైతులు మాత్రమే కాకుండా రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ విధమైనటువంటి మల్చింగ్ ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది పంటపొలాలను రక్షించుకోవడం కోసం ప్లాస్టిక్ మల్చింగ్ విరివిగా ఉపయోగిస్తున్నారు.ఈ విధంగా ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతులపై అధిక భారం పడుతుంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి కడప జిల్లా మైదుకూరుకు మిట్టమానిపల్లె గ్రామానికి చెందిన వీరమోహన్‌ అనే రైతు సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టాడు.

గత ఏడాది నుంచి పాత చీరలను ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం ఐసీఆర్‌పి రామానందరెడ్డి సహకారంతో ఈ వినూత్న ఆలోచనను రైతు ఆచరణలో పెట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది కేవలం 20 సెంట్ల స్థలంలో పాత కాటన్ చీరల ద్వారా మల్చింగ్ విధానంలో పంటను సాగు చేశారు. ఈ విధంగా పాత చీరల ద్వారా మల్చింగ్ చేయడంతో పంట దిగుబడి రావడమే కాకుండా రైతులపై మల్చింగ్ భారం పూర్తిగా తగ్గింది.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏకంగా అర ఎకరం లో ఈ పద్ధతి ద్వారా పంటను సాగు చేస్తున్నారు.

ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించడం వల్ల ఎకరానికి సుమారుగా పదివేల వరకు రైతులపై భారం పడేది.అదేవిధంగా పంట అయిపోగానే ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించటానికి వీలు కాక అవి భూమిలో ఉండిపోయి అధిక భూ కాలుష్యం కలిగించి పంట దిగుబడి తగ్గించేది. అయితే కాటన్ చీరల ద్వారా మల్చింగ్ చేయడంతో రైతులపై సుమారు 5వేల వరకు పంట దిగుబడి పెరుగుతుంది.అదేవిధంగా కాటన్ చీరలు భూమిలో కలిసి పోయిన మూడు సంవత్సరాలకు కుల్లిపోవడం వల్ల వాతావరణ కాలుష్యం,భూ కాలుష్యం జరగదు. ఈ విధంగా వైఎస్ఆర్ జిల్లాలోని పలువురు రైతులు పాత చీరల ద్వారా కొత్త పద్ధతులను పాటిస్తూ వ్యవసాయంలో అధిక లాభాలను పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Share your comments

Subscribe Magazine