Agripedia

ప్రొద్దుతిరుగుడు సాగులో పూత, గింజ ఏర్పడే దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు...!

KJ Staff
KJ Staff

దేశ వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న
నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు పంట కూడా ప్రధానమైనదిగానే చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి స్వల్పకాలంలో అధిక దిగుబడి పొందే అవకాశమున్న ప్రొద్దుతిరుగుడు సాగును మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాధార పంటగాను మరియు నీటి వసతి కింద సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉండడంతో ఖరీఫ్, రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

పొద్దుతిరుగుడు సాగులో పువ్వు వికసించు దశ మరియు గింజ కట్టే దశ చాలా కీలకమైనవి. ఈ దశలలో పంట నీటి ఎద్దడికి గురి అయితే గింజ నాణ్యత లోపించి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కావున నీటి తడులు ఇవ్వగలిగే సామర్థ్యాన్ని బట్టి వారం నుంచి పది రోజులకు ఒకసారైనా నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే పూతదశలో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

బోరాన్ లోపం మొక్కలు లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి.పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి తాలు గింజలు ఏర్పడతాయి. కాబట్టి ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బోరాక్స్ పొడి మొదట గోరువెచ్చని నీటిలో కరిగించి తర్వాత పిచికారి చేయాలి.

ప్రొద్దుతిరుగుడు సాగులో గింజ ఏర్పడే దశలో అడవి పక్షుల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రామచిలుకలు ప్రొద్దుతిరుగుడు గింజ కట్టే దశలో నష్టం కలుగజేస్తాయి. రైతులు సామూహికంగా 20-25 ఎకరాలలో పంటను వేయడం, మెరుపు దిబ్బనులను ఉత్తర దక్షిణ దిశలలో పంటపైన ఒక అడుగు ఎత్తున కట్టడం, దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయడం, శబ్దాలతో పక్షులను పారద్రోలడం లేక కోడిగ్రుడ్డు ద్రావణాన్ని 20 మి.లీ లీటరు నీటికి కలిపి పూలపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయడం వలన చాలా వరకు పక్షుల వలన కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు.

Share your comments

Subscribe Magazine