Agripedia

కాకర సాగులో... తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు ఇవే?

KJ Staff
KJ Staff

సంవత్సరం పొడవునా రైతులకు ఆదాయాన్ని అందించే తీగజాతి కూరగాయల్లో కాకరకాయను ప్రధానంగా చెప్పవచ్చు. కాకరకాయకు మార్కెట్లో స్థిరమైన ధర ఉండడంతో చాలా మంది రైతులు కాకర సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాకర నాటిన రోజు నుంచి 60 రోజులకు కాపు నిచ్చే స్వల్పకాలిక పంట. ఎకరానికి 800 గ్రాముల నుండి ఒక కిలో కాకర విత్తనాలు సరిపోతాయి.కాకర సాగులో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు అయితే గరిష్టంగా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడిని సాధించవచ్చును.ప్రధానంగా కాకర సాగులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. వీటి నివారణ పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం.

రసం పీల్చు పురుగులు : మొక్క5నుంచి 6 ఆకుల దశ నుంచి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది.వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

వేరుకుళ్ళు : ఈ తెగులు సోకితే మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోయి చనిపోతాయి.దీనిని ఎండు తెగులు అని కూడా అంటారు. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.నివారణకు లీ, నీటికి 3 గ్రా. కాపర్లాక్సీక్లోరైడ్ కలిపి పాదుల్లో మొక్కలకు కొంతదూరంలో పోయాలి.

బూడిద తెగులు : వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణం ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి.దీని నివారణకు 125 మి.లీ. డైనోకాప్, 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆంత్రాక్నోస్ : ఆకులపై,కాయలపై గుండ్రని చిన్న మచ్చలు(పక్షి కన్ను ఆకారంలో) ఏర్పడటం వలన ఆకులు, కాయలు ఎండి రాలిపోతాయి. నివారణకు కార్బండాజిమ్ 1గ్రా. లీటరు నీటికి కలుపు కొని 10 రోజులకొకసారి పూత, పిందె దశలలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ వ్యాధిని సమర్థవంతంగా
నివారించవచ్చు.

Share your comments

Subscribe Magazine