ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికం అవుతుండడంతో తెగుళ్ళను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తనశుద్ధి చేయడం ద్వారా విత్తనం,నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చును.
ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో రైతులు ఎక్కువగా
విస్తీర్ణంలో వరి, కంది, పత్తి, వేరుశనగ, అపరాలు
వంటి పంటలను సాగు చేస్తుంటారు.రైతులు నాణ్యమైన విత్తనాలు సేకరించిన తరువాత నేలలో వేసుకోవడానికి ముందు విత్తనశుద్ధి చేస్తే పంటలకు అధికంగా తొలిదశలో ఆశించే చీడపీడల నుంచి రక్షించుకోవడమేగాక, నేల ద్వారా ఆశించే తెగుళ్లను కూడా సమర్థవంతంగా ఖర్చుతో నివారించుకోవచ్చు. వివిధ రకాల పంటలలో విత్తనశుద్ధి, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేరుశనగ : విత్తే ముందు కిలో విత్తనానికి 1గ్రా, కార్బండాజిమ్ లేదా 3 గ్రా. మ్యాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి. తేలిక పాటి నేలల్లో వేరు పురుగు సమస్య కూడా గమనించవచ్చు. అలాంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.6 మి.లీ. క్లోరిపైరిఫాస్ మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో 1 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్.ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా పురుగు మందును కలపాలి. ఆ తర్వాత విత్తనాల్ని ఆరబెట్టి, శిలీంద్ర నాశక మందుల్ని పట్టించాలి.
వరి : వరి నారు పోసుకునే ముందు తప్పనిసరిగా కార్బైండిజమ్ విత్తనశుది చేయాలి. దీనికి తడి పద్ధతిలో అయితే ఒక గ్రాము కార్బైండిజమ్ ఒక కిలో విత్తనాలకు పట్టించి, లీటరు నీటిలో నానబెట్టి మండె కట్టుకోవాలి. లేదా పొడి పద్ధతిలో అయితే మూడు గ్రాముల కార్బైండిజమ్ ఒక కిలో విత్తనాలకు బాగా కలిసే విధంగా పట్టించాలి. వీటిని రెండు మూడు గంటలు ఆరబెట్టిన తరువాత విత్తుకోవాలి.
పత్తి :పత్తిలో శిలీంధ్ర నాశినలతో విత్తన శుద్ధి చేయడం ద్వారా సుమారు 40-50 రోజుల వరకు వేరుకుళు, మచ్చల తెగుళ్ళ నుండి రక్షణ కల్పించవచ్చు.ఒక కిలో విత్తనాలకు రెండు గ్రాముల కార్బండిజం లేదా పదిగ్రాముల సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ లేదా 10 గ్రామల ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి.
కంది, పెసర : ఒక కిలో విత్తనాలకు 2.5 గ్రాముల ధైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తనశుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల్లో మళ్లీ శుద్ధి చేయాలి. మళ్లీ జీవ నియంత్రణకారి అయిన ట్రైకోడెర్మా విరిడితో 8-10 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే ఎండుతెగులు, కాండం కుళ్లు, వేరుకుళ్లు, వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా - నివారించొచ్చు.
సజ్జ : విత్తన శుద్ధికిలో 20 గ్రా లీటరు ఉప్పునీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచటం ద్వారా ఎర్గట్ శిలింద్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. విత్తనాలు ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల తైరంను లేదా 2 గ్రాముల మేతలక్సిల్ మందు కలుపుకోవాలి. ఈ ద్రావణం విత్తనాలకు సమానంగా అతికేల బాగా కలియతిప్పాలి.
విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల అనేక రకాల చీడపీడలను కొంత వరకూ నివారించుకోవచ్చు
Share your comments