Agripedia

పుట్టగొడుగుల సాగులో లాభాలు పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..?

KJ Staff
KJ Staff

ఒకప్పుడు యువత మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని భావించేవారు. కానీ ప్రస్తుతం యువతలో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది యువత ఆలోచన వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి నప్పటికీ వ్యవసాయంలో అడుగుపెట్టి ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే అనంతపురం జిల్లా, సింగనమల మండలం, నిదరవాడకు చెందిన రాజేష్ కుమార్.

రాజేష్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నాడు. అయితే తను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదని ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. వ్యవసాయంలోకి అడుగు పెట్టిన మొదట్లో ముళ్ల బాటలో నడిచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాజేష్ వాటిని అనుభవాలుగా చేసుకొని ప్రస్తుతం పూల బాటలు విజయపథంలో దూసుకుపోతున్నాడు.

రాజేష్ ఉద్యోగం చేస్తూనే శని ఆదివారాలలో తన ఊరికి వచ్చి పొలం పనులను చూసుకునేవాడు. అయితే అధిక వర్షాభావం, ధరలు గిట్టుబాటు లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజేష్ నాలుగు సంవత్సరాల కిందట లక్షలు పెట్టుబడి పెట్టి పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టాడు. పుట్టగొడుగుల పెంపకం అంటే అడుగడుగున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఎంతో నష్టాన్ని భరించాల్సి ఉంటుందని పుట్టగొడుగుల పెంపకం గురించి వివరించారు.

పుట్టగొడుగుల పెంపకం చేయాలంటే ముందుగా నాణ్యమైన వరిగడ్డిని ఉడికించి దానిలో ఏ విధమైనటువంటి సూక్ష్మజీవులు లేకుండా శుభ్రపరచుకోవాలి.100 గ్రా. పుట్టగొడుగు విత్తనాలను పాలిథీన్ కవర్ లో వేసి చుట్టూ ఒక అంగుళం మందంతో వరి గడ్డిని చుట్టాలి. ఈ విధంగా విత్తనాలు వేస్తూ గడ్డిని వేస్తూ ఐదుసార్లు చేయాలి. ఈ విధంగా చుట్టిన గడ్డిని ఒక చీకటి గదిలో కనీసం ఒక దోమ కూడా ఉండని గదిలో ఉంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 25 రోజుల ప్రక్రియలో భాగంగా దీనిలో మైసీలియం అనే ఫంగస్ పుడుతుంది. తర్వాత గాలి వెలుతురు వచ్చే గదిలోకి మార్చాలి.

ఈ గదిలో ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీలు, గాలిలోని తేమ, ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనకు పది రోజులలో మొదటి కాపు వస్తుంది. ఆ తర్వాత వరి గడ్డి ఉన్న కవర్ పై నీటిని చల్లితే మరోసారి కాపు వస్తుంది. ఈ విధంగా ఒక కవర్ నుంచి ఆరు నుంచి పది కిలోల వరకు పుట్టగొడుగులు మూడు కాపులలో వస్తాయని తెలిపారు.

ఈ విధంగా రాజేష్ ప్రతిరోజు సుమారు 50 నుంచి 60 కిలోల పుట్టగొడుగులను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పుట్టగొడుగులను హోల్సేల్ అయితే కిలో 200, రిటైల్ 300 చొప్పున అమ్ముతున్నారు. ఎండబెట్టిన పుట్టగొడుగులు అయితే కిలో 800 వరకు ధర పలుకుతోంది అని రాజేష్ తెలియజేశారు.నెలకు సుమారుగా పుట్టగొడుగులు మూడు టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నాయని వీటిని మార్కెటింగ్ చేయడం ద్వారా సుమారు 4 లక్షల వరకు వస్తోందని తెలిపారు. ఇందులో 2 లక్షలు పెట్టుబడికి పోను మిగిలిన రెండు లక్షల ఆదాయం ఉందని ఈ సందర్భంగా రాజేష్ తెలియజేశారు

Share your comments

Subscribe Magazine