Agripedia

భూసార పరీక్షలు-ఆవశ్యకత-మట్టి నమూనాల సేకరణ పద్ధతి !

Srikanth B
Srikanth B
భూసార పరీక్షలు-ఆవశ్యకత-మట్టి నమూనాల సేకరణ పద్ధతి !
భూసార పరీక్షలు-ఆవశ్యకత-మట్టి నమూనాల సేకరణ పద్ధతి !
నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ, అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సం||లకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. 
పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడ మృత్తిక (మట్టి) పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్షలో అన్నింటి కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం:
భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక, ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడ చేయడం జరుగుతుంది. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో ఈ క్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.
  • పొలంలో  ‘V’  ఆకారంలో 15 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింద వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
  • ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి ½ కిలో వచ్చే వరకు చేయాలి.
  • ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్ళు లేనట్లుగా చూసుకుని, నీడలో ఆరనివ్వాలి.
  • మట్టి నమూనా సేకరణకు రసాయనిక/సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు.
  • మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినపుడు
  • గట్ల దగ్గరలోను మరియు పంట కాల్వలలోను మట్టిని తీసుకోరాదు.
  • చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరు వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్భాల్లో కూడ, పైన తెలిపిన జాగ్రత్తలు పాటించాలి.
పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని, అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు. 
ప్రయోజనాలు:
భూసార పరీక్షలు చేయించుకోవడం వలన భూమిలో లేదా వాళ్ళు పండించే పొలంలో మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 
సమస్యాత్మకమైన భూములు ఉన్నా కూడా వాటి గురించి తెలుసుకొని వాటిని సవరించుకునే విధానాలు కూడా ఉపయోగించవచ్చు. 
మన రైతులు వచ్చే కాలంలో ఏ పంటలు వేసుకుంటున్నారు, ఆ పంటకు కావాల్సిన ఎరువులు, వాటిని ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ భూసార పరీక్షల వలన తెలుసుకోవచ్చు.
అది కాకుండా ఈ కాలంలో పట్టణ పరిసరాల్లో చాలా వరకు పరిశ్రమలన్నీ బాగా పెరిగిపోయి అందులో వచ్చే విష పదార్థాలు కానీ, కాలుష్యం చెందించే పదార్థాలన్నీ నీటిలో గానీ లేదా నేలలో గానీ కలిసిపోయి అవి కూడా పంటకు చాలా వరకు నష్టాన్ని కలుగచేస్తున్నాయి. కాబట్టి ఈ భూసార పరీక్షలు చేయడం వలన ఏమైన విషపదార్థాలు నేలల్లో ఉన్నాయా కూడా రైతులు సులభంగా తెలుసుకోవచ్చు.
ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు భూసార పరీక్షల ద్వారా ఉన్నాయి కాబట్టి రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
Author 
జె. విజయ్ (సేద్య విభాగపు శాస్త్రవేత్త); కె.సుప్రజ (ల్యాబ్ అసిస్టంట్, మృత్తిక విభాగం); డా. ఎల్. మహేష్ (విస్తరణ శాస్త్రవేత్త); డా.ఎన్. వెంకటేశ్వరరావు (సీనియర్ శాస్త్రవేత్త, హెడ్); డి.శ్రీనివాస్ రెడ్డి (సస్య రక్షణ శాస్త్రవేత్త); జమ్మికుంట. 


ఇది కూడా చదవండి .

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

Related Topics

soiltest

Share your comments

Subscribe Magazine