వర్షాకాలం వచ్చిందంటే పాడిరైతులు మరియు జీవాల పెంపకందారులు, వాటికి మేత అందించడం కఠినతరంగా మారుతుంది. ఈ సమయంలో పశువులకు అవసరమైన పోషకాలతో కూడిన మేతను అందించడం కష్టతరమే కాకుండా, రైతులకు ధన భారం కూడా. పశువుల్లో పోషణలోపం ఉంటే పాల దిగుబడి తగ్గిపోతుంది, దీనితోపాటు పశువులు రోగాల భారిన పడే అవకాశం కూడా ఎక్కువుగా ఉంటుంది. అదే రైతులు పశుగ్రాసాల పెంపకం మీద దృష్టిసారిస్తే, పశువుల పోషణ సులభతరం అవుతుంది. అందుబాటులో ఉన్నది కొద్దిపాటి స్థలమైన సరే దానినే వినియోగించుకుంటూ, పశువుల మేతను సులభంగా పెంచవచ్చు. ఈ పశుగ్రాసాలు పశువులకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రైతుల వ్యయ భారాన్ని కూడా తగ్గిస్తుంది.
సూపర్ నేపియర్, మరియు జూరి అనే రెండు రకాలు పశుగ్రాసాలను రైతులు ఎక్కువ మొత్తంలో సాగుచేస్తున్నారు. ఈ గడ్డి రకాలు కేవలం పాడి పశువుల పోషణకేకాకుండా, జీవాల పోషణకు కూడా అనుకూలంగా ఉంటాయి. అధిక దిగుబడిని ఇవ్వడం ఈ రెండు రకాల ప్రత్యేకత, కాబ్బటి కొద్దిపాటి స్థలంలో కూడా సులభంగా సాగుచేసుకోవచ్చు. ఇవి బహువార్షిక ధాన్యపుజాతి పశుగ్రాసాలు కావడంతో పశువులకు అధిక పోషకాలు కలిగిన గ్రాసాన్ని అందించేందుకు సాధ్యపడుతుంది. వీటిని ఒక్కసారి నాటుకుంటే సుమారు ఐదు సంవత్సరాల వరకు దిగుబడినివ్వగలవు.
సూపర్ నేపియర్ పశుగ్రాసాల కాండం లావుగా ఉంది ఆకులు మెత్తగా ఉంటాయి కాబట్టి పశువులకు జీర్ణం చేసుకోవడంలో ఎటువంటి సమస్య తలెత్తదు. సూపర్ నేపియర్ గ్రాసాన్ని నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది, ఈ గ్రాసాన్ని ముక్కలుగా కోసి, 100 కిలోల బెల్లం మడ్డిని కలిపి, సైలేజిగా మార్చి నిల్వచేసుకోవచ్చు. దీనిని ఆఫ్-సీజన్లో పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. అయితే సైలేజిని మేతగా వాడే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి, ఎందుకంటే దీనిలో ఆక్సలేట్లు ఎక్కువుగా ఉండటం వలన పశువుల్లో కాల్షియమ్ లోపం వస్తుంది, దీనిని నివారించడానికి పశువులకు కాల్షియమ్ అందించవలసి ఉంటుంది. జూరి గ్రాసాని, మేతగా వాడుతున్న రైతులు ఈ గడ్డి ముదరకుండానే గ్రాసాన్ని కత్తిరించాలి, గడ్డి ముదిరిపోతే పశువుల్లో జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది, కాబట్టి గడ్డి ముదరకుండా 35 రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలి.
ఈ రెండు రకాల గ్రాసాలను సులభంగా సాగు చేసుకోవచ్చు, వీటిని ఒక్కసారి నాటుకుంటే 5 ఏళ్ల వరకు పశుగ్రాసాలకు కొదవుండదు. వీటిని సాగుచేసేందుకు అయ్యే ఖర్చుకూడా తక్కువే. వీటి ఎదుగుదలకు అవసరమైన పోషకాలను మరియు నీటిని క్రమం తప్పకుండా అందిస్తే ఎంతో కాలం వరకు వీటిని సాగుచేసుకోవచ్చు. ఒకఏడాదిలో 6-7 సార్లు కోత కొయ్యవచ్చు, మరియు ఒక ఎకరంలో సుమారు 200 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ గ్రాసాలలో అధిక పోషక విలువలు ఉండటం మూలాన పాల దిగుబడి కూడా పెరుగుతుంది.
Share your comments