ఈ మధ్య కాలంలో పాడి పరిశ్రమ మల్లి తిరిగి ఊపిరి పోసుకుంటుంది, రైతుల ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. ఆర్గానిక్ వ్యవసాయానికి పాడి పరిశ్రమ ఊతం వంటిది. ప్రకృతి వ్యవసాయాన్ని పశుఆధారిత వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. అయితే పాడిపోషణ రైతులు అనేక జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. పాడి పరిశ్రమలో లేగ దూడలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి, అప్పుడే పుట్టిన లేగదూడలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది, వీటిని జాగ్రత్తగా పెంచి పెద్దచెయ్యడం ద్వారా అవి భవిష్యత్తులో మంచి ఆదాయనిచ్చే వనరుగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, రైతులు వీటిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. లేగదూడల పెంపకంలో పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దుదపుట్టగానే శరీరం మొత్తం జిగురుతో పుడుతుంది, కాబట్టి పుట్టిన వెంటనే నోరు , ముక్కు వద్ద ఉండే జిగురు వంటి పదార్ధాన్ని తొలగించాలి, దీని వలన శ్వాస బాగాఆడుతుంది. అప్పుడే పుట్టిన దూడ అవయవాలను పరిశీలించాలి, ఏమైనా అవయవాలు సరిగ్గా ఏర్పడకుండా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి అవసరమైన చికిత్స అందించాలి. దూడ బరువు ఎంతుందో చూడాలి, బరువు తక్కువగా ఉంటె అవసరమైన చికిత్స అందించాలి.
దూడ పుట్టగానే బొట్టువద్ద వేలాడే పేగును కత్తిరించవలసి ఉంటుంది లేదంటే కొన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. బొడ్డువద్ద రెండు అంగుళాలు వదిలిపెట్టి, మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. కత్తిరించిన స్థలంలో డెటాల్ లేదా ఐయోడిన్ సొల్యూషన్ రాయాలి, దీనివలన బొడ్డువాపు, మరియు ఇతర ఇంఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. మనుషుల్లో అప్పుడే పిల్లలకు తల్లిపాలు ఎంత బలమో, లేగదూడలకు కూడా వాటి తల్లిపాలు అంతే బలం. అప్పుడే పుట్టిన దూడ జున్నుపాలు తాగేలా చెయ్యాలి.
దూడ బలహీనంగా కనిపిస్తే, వైద్యున్ని సంప్రదించి, విటమిన్- ఎ ,ఇ, డి, మరియు ఐరన్ ఇంజెక్షన్లు వెయ్యించడం, లేదంటే నోటిద్వారా మందులను అందించడం చెయ్యాలి, లేకుంటే దూడలు బరువు తగ్గి బలహీనపడే అవకాశం ఉంటుంది. పుట్టిన పదిరోజులలోపు దూడలు వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకు అవసరమైన టీకాలను వెయ్యించాలి, మొదటిరోజు ధనుర్వాతం టీకా, రెండో రోజు బి-విటమిన్, టెట్రాసైక్లిన్, యాంటీ బయోటిక్ బిళ్ళను లేదని పొడిని ఇవ్వాలి దీని వలన విరోచనాలు వంటివి రాకుండా నియంత్రించవచ్చు. 7 వ రోజు ఎలికపాముల నిర్ములనకు పైపర్జిన్ అడిపేట్, ఫెన్ జెండాజోల్ వంటి మందులు సిరప్ రూపంలో అందించాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తే, లేగదూడలు ఆరోగ్యవంతంగా పెరిగి భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.
Share your comments