Animal Husbandry

ముద్ద చర్మం రోగము – మన సంప్రదాయ వైద్యము!

KJ Staff
KJ Staff
traditional medicine for Lumpy skin disease
traditional medicine for Lumpy skin disease

ప్రస్తుతం మన దేశంలోని పశువులు (ఆవులు మరియు గేదెల) పై లంపీ స్కిన్ వైరస్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు సుమారుగా యనభైఏడువేల పశువులు పైగా మరణించాయి. ఈ లంపీ స్కిన్ డిసీజ్ (LSD) లేదా ముద్ద చర్మం వ్యాధి అనేది క్యాప్రీ పాక్స్ వైరస్ వల్ల ఆవులు మరియు గేదెలకు సంక్రమించే వైరల్ వ్యాధి. ఇది జూనోటిక్ వ్యాధి కాదు, అంటే ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకి వ్యాపించదు. ఇది దోమలు, కొన్ని కొరికే ఈగలు మరియు పేలు వంటి ఆర్థ్రోపోడ్ వెక్టార్స్ ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం ఈ వ్యాధి సోకిన పశువుల యొక్క నోరు మరియు శ్వాసరంధ్రాల నుండి వచ్చే స్రావాలతో కలుషితమైన మేత మరియు నీరు ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కృత్రిమ గర్బధారణ సమయంలో వ్యాధి సోకిన పశువుల యొక్క వీర్యం వాడడం వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

లక్షణాలు :
ఈ వ్యాధి 2-3 రోజుల పాటు తేలికపాటి జ్వరంతో మొదలై తరువాత శరీరం అంతటా చర్మంపై గట్టి, గుండ్రని చర్మపు ముద్దలు (నాడ్యూల్స్) 2-5 సెం.మీ వ్యాసం వరకు అభివృద్ధి చెందుతాయి.


ఈ ముద్దలు (నాడ్యూల్స్) చర్మం పై గుండ్రంగా, ధృఢంగా ఉండి కొన్నిసార్లు కండరాల వరకు కూడా వ్యాపిస్తాయి.

నోరు, గొంతు మరియు శ్వాస మార్గములో పుండ్లు లేదా గాయాలు, లింఫ్ గ్రంధులు పెద్దవవడం, అవయవాల వాపు, గర్బాస్రావం, వంధ్యత్వం వంటి లక్షణాలు చూడవచ్చును. వ్యాధి సోకిన పశువులు తరచుగా 2-3 వారాల వ్యవధిలో కోలుకున్నప్పటికీ చాలా వారాల పాటు పాలిచ్చే పశువులలో పాల దిగుబడి తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాధి సోకిన పశువులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.

చికిత్స:
అల్లోపతీ వైద్యంలో భాగంగా :
• Inj. మెలోనేక్స్ @ 0.5 mg/kg – I/M, 3 రోజులు.
• Inj. స్ట్రెప్టో పెన్సిలిన్ @ 5mg/400kg – I/M, 5 రోజులు
• Inj. సి‌పి‌ఎం @ 0.4 - 0.5mg/kg – I/M, 3 - 5 రోజులు
• Inj. ఫ్యూరొసిమైడ్ @ 0.5 – 1mg/kg – I/M, 3 రోజులు
• Inj. బి – కాంప్లెక్స్ - I/M, 5 రోజులు
• దోమలు, కోరికే ఈగలను పారద్రోలే మరియు గాయాన్ని నయం చేసే క్రీములను వాడవలెను.

సంప్రదాయ వైద్యంలో భాగంగా :

• తమలపాకులు (10), మిరియాలు (10గ్రా), ఉప్పు (10గ్రా) తీసుకొని ముద్దగా చేసి బెల్లంతో కలిపి కలిపి పశువు యొక్క ఆరోగ్య పరిస్తితి మెరుగుపడే వరకు రోజుకు మూడు సార్లు, 2 వారాల పాటు తినిపించవలెను.
• తులసి ఆకులు చారెడు, వెల్లుల్లి రెబ్బలు (2), జీలకర్ర (10గ్రా), తమలపాకులు (5), పసుపు పొడి (10గ్రా), చారెడు వేప మరియు మారేడు ఆకులను తీసుకొని ముద్దగా చేసి దానికి 100గ్రాముల బెల్లన్ని కలిపి పశువు యొక్క ఆరోగ్య పరిస్తితి మెరుగుపడే వరకు రోజుకు 2 సార్లు చొప్పున తినిపించవలెను.
• వెల్లుల్లి రెబ్బలు (10), వేప ఆకులు చారెడు, పసుపు పొడి (20గ్రా), చారెడు తులసి మరియు గోరింటాకును తీసుకొని ఈ పదార్థాలు అన్నింటిని నూరుకొని దానికి కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని బాహ్య చర్మంపైన ఏర్పడుతున్న పుండ్లకు రాయవలెను. ఒకవేళ పుండ్లలో పురుగులు ఉన్నట్లైతే సీతాఫలం మరియు తగరించాకు యొక్క రసాన్ని ఆ పురుగులున్న చోట పిండినట్లైతే ఆ పురుగులు పోతాయి.

వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే లాభాలు !

నివారణ మరియు నియంత్రణ :
• మొదటగా నులి పురుగుల నివారణ కొరకు బెల్లం, ఉస్తికాయ పొడిని ఆముదంతో కలిపి వాడాలి.
• వేపపొడి, పసుపుపొడి మరియు శీకకాయి పొడిని కలిపిన నీళ్ళతో పశువును శుభ్రంగా కడగాలి.
• పసుపుపొడి, వేపపొడి మరియు కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా చేసి దాన్ని పశువు శరీరంపైన ఏర్పడిన ముద్దలకు పూయలి.
• రాళ్ళ ఉప్పు మరియు పసుపుపొడితో కరిగిన నీటిని ఉపయోగించి పశువుల పాకను శుబ్రపరుచుకోవాలి.
• 30 లీటరు నీటిలో 30 నిమిషాలు నానబెట్టిన 2-3 గుప్పెళ్ళు తాజా వేపాకులను తీసుకొని దానికి గోధుమ పొట్టు / బియ్యపు ఊకను మరియు బెల్లంను కలిపి పశువుకి తినిపించాలి.
నియంత్రణలో భాగంగా

• ఆరోగ్యవంతమైన పశువుల నుండి జబ్బుపడిన/ సోకిన పశువులను తక్షణమే వేరు చెయ్యాలి.
• జ్వర సంబంధమైన ముద్ద (నాడ్యూలర్) చర్మ వ్యాధి ఉన్నట్లు అనుమానించబడిన ఏదైనా పశువును ఈ వ్యాధి వల్ల ప్రభావితం కాని పశువుల మందలోకి చేర్చకూడదు.
• ప్రభావిత ప్రాంతాల్లో వెక్టార్స్ (దోమలు, ఈగలు మరియు పేలు) సంఖ్యను తగ్గించేందుకు కృషి చెయ్యాలి.
• ప్రభావిత పశువుల ప్రాంగణాలు మరియు పరిసర ప్రాంతాలను ఈథర్ (20%) / ఫార్మాలిన్ (1%) / ఫీనాల్ (2%) / సోడియం హైపోక్లోరైట్ (2-3%) వంటి క్రిమిసంహార రసాయనాలను ఉపయోగించుకొని శుభ్రపరుచుకోవాలి.

Author
డా. జి. మితున్,
పశు సంరక్షణ శాస్త్రవేత్త,
డి.డి.ఎస్‌. కృషి విజ్ఞాన కేంద్రం,
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్ నెo. 7799804000

వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే లాభాలు !

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More