Animal Husbandry

అధిక లాభాలను సమకూర్చే నాటు కోడి గుడ్ల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!

KJ Staff
KJ Staff

భారతదేశ గ్రామీణ ప్రజల జీవన విధానంలో వందల సంవత్సరాలుగా నాటు కోళ్ల పెంపకం వారి జీవితంలో భాగమై కొనసాగుతోంది. ప్రస్తుతం నాటు కోడి గుడ్లకు, మాంసానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది చిన్న సన్నకారు రైతులు,నిరుద్యోగ యువత, మహిళలు ప్రత్యేక వసతులు కల్పించి భారీ స్థాయిలో నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి పోషక విలువలున్న నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో నాటు కోడి కిలో మాంసం ధర 500 రూపాయల వరకు ఉంటుంది. డిమాండ్ను బట్టి 600 రూపాయల వరకు కూడా పలుకుతోంది.అదే నాటు కోడి గుడ్డు ధర 10 నుంచి 15 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు.

సాధారణంగా నాటుకోళ్ళలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది కావున వీటికి వ్యాధుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అలాగే బ్రాయిలర్ కోళ్ళలాగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే నాటు కోళ్లను పెంచుతూ నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేయాలంటే కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా కోళ్లని పెంచడానికి నిర్మించే షెడ్డు కన్నా గుడ్ల ఉత్పత్తికి నాటు కోళ్లను ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో పెంచితే మంచి ఫలితాలు వస్తాయి.

నాటు కోళ్లు సహజంగా గుడ్లు పెట్టడానికి చీకటి ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కావున కోళ్ల షెడ్డులో పెట్ట కోడి గుడ్లు పెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం పాత టైర్లను ఒకదానిపై ఒకటి పేర్చి గుడ్లు పెట్టడానికి అనువుగా ఉండునట్లు ఏర్పాటు చేస్తే వాటిలోకి వాటంతటం అవే వెళ్లి గుడ్లు పెడతాయి ఈ రబ్బర్ తో కూడిన టైర్ వల్ల గుడ్డు పగలకుండా సురక్షితంగా ఉంటాయి.

నాటు కోళ్లను గుడ్ల కోసం పెంచుతున్న అప్పుడు 8 పెట్ట కోళ్ళకు ఒక పుంజు ఉండునట్లు చూసుకోవాలి.నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. అలా ఏడాదికి ఒక పెట్ట కోడి నాలుగైదు సార్లు గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల ఉత్పత్తిని పెంచుకోవాలి అనుకుంటే శాస్త్రీయ పద్ధతుల్లో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కోడి గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్లీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంది.

సాధారణంగా నాటుకోళ్ళు కొన్నిసార్లు తోలు గుడ్లను పెడుతుంటాయి ఇలాంటి వాటిని నివారించడానికి. కోడి పెట్టలు గుడ్లు పెట్టే సమయంలో ప్రతిరోజు ఒక్కొక్క పెట్టకు 3 గ్రాముల పాడిస్తున్నం గాని, పొడి చేసిన కోడి గ్రుడ్డు పెంకును గాని, మార్కెట్లో దొరికే కాల్ సేమ్ లవణాలను అందించినట్లయితే తోలు గుడ్డు పెట్టడాన్ని నివారించవచ్చు. నాటు కోళ్లను, నాటు కోళ్ల గుడ్ల ఉత్పత్తులను వాణిజ్య సరళిలో పెంచాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Share your comments

Subscribe Magazine