పాడి పశువుల్లో పాల దిగుబడిని, మనం అందించే మేత చాల ప్రభావితం చేస్తుంది. పశువులు ఆరోగ్యంగా ఉండటానికి, మరియు మంచి పాల దిగుబడి రావడానికి పచ్చి మేత కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చి మేతలో అనేక రకాలు ఉన్న నేపియర్ జాతి గడ్డికి ప్రాధ్యానత ఎక్కువ. నేపియర్ గడ్డి పెంచేందుకు సులువుగా, మరియు అధిక పోషకాలను కలిగి ఉంటుంది. నేపియర్ గడ్డి యొక్క కాండం మెత్తగా మరియు పశువులు సులువుగా అరిగించుకోగలిగేలా ఉంటుంది, తద్వారా పశువులు ఈ గడ్డిని ఇష్టంగా తింటాయి.
పశుగ్రాసాల కోసం గడ్డిని పెంచుదాం అనుకునే రైతులకు సూపర్ నేపియర్ ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. సూపర్ నేపియర్ లో మాంశకృతులు మిగతా గడ్డి రకాలతో పోల్చుకుంటే అధికంగా ఉంటాయి. ఆకుల్లోలోని తియ్యదనం పశువులు ఈ గడ్డిని ఇష్టంగా తినేందుకు తోడ్పడుతుంది. సూపర్ నేపియర్ పచ్చి గడ్డిగా మరియు ఎండు గడ్డిగా రెండు రకాలుగా పశువులకు అందించవచ్చు.
సూపర్ నేపియర్ రకాన్ని థాయిలాండ్ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. దాదాపు అన్ని రకాల నెలల్లోను ఈ రకాన్ని సులువుగా పెంచుకోవచ్చు. కాకపోతే నీరు నిలిచే నేలలు, మరియు బీడు నేలలు, సూపర్ నేపియర్ సాగుకు అనువుగా ఉండవు. సూపర్ నేపియర్ బహువార్షికం కనుక 5-6 సంవత్సరాల వరకు దిగుబడిని పొందవచ్చు.
Read More:
నాటు కోళ్ల పెంపకం.... ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ.
పశుగ్రాసాల ఉపయోగం మరియు వాటి పెంపకం .
సూపర్ నేపియర్ అన్ని కాలాల్లోనూ వేసుకోదగిన పంట, అలాగే బహువార్షిక రకం కనుక సాగు నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం మంచిది. సూపర్ నేపియర్ గడ్డిని కాండం ముక్కల ద్వారా కానీ, వేరు పిలకలు నుండి పెంచుకోవచ్చు. కాండం ముక్కల ద్వారా పెంచేందుకు, కాండాన్ని 40సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించాలి, ప్రతీ కాండానికి రెండు కణుపులు ఉండాలి.
కాండం ముక్కలు నాటే ముందు పొలం మొత్తం బాగా దున్నుకోవాలి, రెండవ దుక్కులో ఒక ఎకరానికి 45 కేజీల యూరియా, 25 కేజీల పోటాష్ మట్టిలో కలియ దున్నుకోవాలి. మట్టిలోని సారాన్ని పెంచేందుకు, ఒక ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువును మట్టిలో కలియదున్నడం శ్రేయస్కరం. మట్టిని దున్నిన తర్వాత వరుసలను సిద్ధం చేసుకోవాలి, ప్రతీ వరుసకు మధ్య 60సెంటీమీటర్ల దూరాన్ని ఉంచడం ద్వారా నీటి తడులు ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. కాండం ముక్కలని, రెండు కణుపుల్లో ఒక కన్ను భూమిలోను మరొక్క కన్ను పైకి ఉండేలా 45 డిగ్రీల కోణంలో నాటుకోవాలి.మొక్క నాటిన మూడురోజులు మరియు ఎనిమిది రోజుల తర్వాత నీటిని అందిచడం చాల ముఖ్యం. నాటిన ఆరు రోజుల తర్వాత వేర్లు రావడం మొదలవుతాయి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత 45 కేజీల యూరియా వెయ్యడం ద్వారా అధిక దిగుబడి వస్తుంది.
మొక్క తక్కువుగా ఎత్తులో ఉన్నపుడు పొలంలో కలుపును నివారించడం ఎంతో అవసరం. సుమారు 40-45 తర్వాత పొలంలోని కలుపును పూర్తిగా నివారించాలి. మొక్క పూర్తిగా ఎదిగిన తరువాత కలుపు మొక్కలు పెరిగేందుకు వీలులేకుండా చేస్తుంది. సూపర్ నేపియర్ 20 నుండి 25 అడుగుల ఎత్తు వరుకు పెరుగుతుంది, దేశి నేపియర్ రకాలకన్నా ఇది చాల ఎక్కువ. తద్వారా ఒక్క ఎకరం సూపర్ నేపియర్ సాగు ద్వారా 10 నుండి 15 పశువుల పోషణకు సరిపోతుంది. కేవలం పాడి పశువుల పెంపకానికే కాకుండా, నేపియర్ గడ్డిని గొర్రెలు మేకల పోషణకు కూడా వినియోగించవచ్చు.
Share your comments