Animal Husbandry

వేసవిలో పశువులు జాగ్రత్త.

KJ Staff
KJ Staff
Buffalo
Buffalo

ఏప్రిల్ పూర్తయి మే వచ్చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల వరకు పెరిగిపోతాయి. ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి.

అసౌకర్యానికి లోనవుతాయి.. ఆవుల కంటే గేదెలు ఎక్కువగా వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. గేదెలు నల్లగా ఉండడం వల్ల వాటిపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశుపోషణ విషయంలో ఎండాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వడ దెబ్బ ప్రభావం ఎలా ఉంటుందంటే..

వడ దెబ్బ తగలకుండా వీలైనంత వరకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పశువులకు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీలు మాత్రమే. అంతకంటే ఎక్కువగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటాయి. నోట్లో లాలా జలం కూడా తగ్గిపోతుంది. నెమరు వేయడానికి వీలు పడదు. దాహం ఎక్కువగా ఉండి ఎక్కువ నీళ్లు తాగుతాయి. ఫలితంగా మేత సరిగ్గా తినవు. శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయులు తగ్గిపోయి నీరసించిపోతుంది. పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

వడదెబ్బ బారి నుంచి రక్షించడమెలా?

ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, గాలి ప్రసరణ ఎక్కువగా లేకపోవడం, షెడ్లలో ఎక్కువ పశువులు ఉండడం వల్ల ఉక్కపోత, నీటి సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల పశువులు వడ దెబ్బకు గురవుతాయి. తూలుతూ నడుస్తూనే అవి పడిపోతాయి. శ్వాస పీల్చుకోవడం కష్టం అవడంతో రొప్పుతుంటాయి. ఇలాంటప్పుడు వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు. లేదా చల్లని నీటిలో తడిపిన బట్ట, గోనె సంచిని కప్పాలి. సెలైన్ ఎక్కించడం లేదా సోడియం క్లోరైడ్ అందించడం చేయాలి. శరీర ఉష్ణోగ్రత అయినా తగ్గకపోతే సోడియం సాలిసిలైట్, పారసిటమాల్ ఇంజెక్షన్లు చేయాలి.

ఎండ తీవ్రత నుంచి తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. షెడ్ ల చుట్టూ సుబాబుల్, అవిసె చెట్లను వేయడం వల్ల చల్లగా ఉంటుంది. పశుగ్రాసం కూడా లభిస్తుంది. పాకల పైకప్పులను తాటాకులతో లేదా గడ్డితో కప్పి ఉంచి వాటిని తడుపుతూ ఉండాలి. చుట్టూ పరిసరాల్లో నీటిని చల్లడం ద్వారా వాతావరణం చల్లబర్చవచ్చు. పశువులను రోజుకి రెండు మూడు సార్లు కడగాలి. ఒకసారి ఈ నీటిలో బ్యుటాక్స్ మందు కలపడం వల్ల పరాన్న జీవులు దూరంగా ఉంటాయి. తాగేందుకు ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచాలి. అవి కూడా చల్లగా ఉండేలా చూసుకోవాలి. సులువుగా అరిగించుకునే జావ, గంజి వంటివి ఇవ్వాలి. పచ్చి గడ్డి ఎక్కువగా ఇవ్వాలి. లేదంటే మాగుడు గడ్డి ఇవ్వాలి. మేత కూడా ఉదయం సాయంత్రం ఇవ్వాలి. పచ్చి గడ్డిని పగలు, ఎండు గడ్డిని రాత్రి వేళల్లో అందించాలి. ఎండ వేళల్లో వాటికి విశ్రాంతి ఇవ్వాలి. రైతు ఆర్థిక స్థోమతను బట్టి ఫ్యాన్లు, తుంపర్లు వెదజల్లే మిషీన్లు ఏర్పాటు చేయాలి. కప్పు పై భాగంలో తెల్లని పెయింట్ వేయడం వల్ల సూర్య కిరణాలు పరావర్తనం చెంది వేడి తగ్గుతుంది. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఉప్పు గడ్డను వాటి ముందు పెట్టడం వల్ల అవి వాటిని నాకినప్పుడల్లా ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

వేసవిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాలి కుంటు వ్యాధి, గొంతు వాపు, జబ్బ వాపు వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. మురుగు నీళ్లు తాగితే జీర్ణ కోశ వ్యాధులు వస్తాయి కాబట్టి శుభ్రమైన నీటిని అందించాలి. ఎప్పటికప్పుడు వాటిని పరిశుభ్రంగా, చల్లగా ఉంచుకోవాలి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పశువుల కోసం ఆరోగ్యకరమైన పశువుల వీర్యాన్ని ఉపయోగించాలి. పాకలు ఎప్పుడూ చల్లగా ఉంచుకోవడం వల్ల సూక్ష్మ జీవులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

https://krishijagran.com/animal-husbandry/tips-for-fish-farming-in-summer-season/

https://krishijagran.com/animal-husbandry/livestock-management-how-to-take-care-of-farm-animals-in-rainy-season/

https://telugu.krishijagran.com/animal-husbandry/during-rainy-season-do-not-do-such-mistakes-it-may-effect-health-of-milk-giving-animals/

Related Topics

Dairy Farmers

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More