తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండ తీవ్రత అధికమవుతూ వస్తుంది. పశుపోషకులు వేసవి కాలం ఎంతో కష్టతరంగా ఉంటుంది. పశువులు ఎండ వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడతాయి. వేసవి కాలంలో పాల దిగుబడి మరియు పాలలోని వెన్న శాతం కూడా తగ్గుతుంది. ముఖ్య గేదెలు మరియు నల్ల రంగు ఆవుల మీద ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సూర్యిని తాపానికి పశువులు రోగనిరోధక శక్తిని కోల్పోయి రోగాలపాలవడం రైతులు గమనిస్తుంటారు. అయితే పాడిపశువులను కొన్ని మేలైన యాజమాన్య పద్దతుల ద్వారా వేసవి తాపం నుండి కాపాడుకోవచ్చు.
వేసవి కాలంలో పశువులు తీవ్రమైన అసౌకర్యనికి మరియు అనారోగ్యానికి గురవుతాయి. పశువులను వేడి నుండి రక్షించడానికి, పశువుల షెడ్ పైన స్ప్రింకలేర్లు ఏర్పాటు చేసుకుని నీటిని స్ప్రే చెయ్యడం ద్వారా షెడ్ లోపల కొన్ని డిగ్రీల వరకు వేడిని తగ్గించవచ్చు. స్ప్రింకలేర్స్ ఏర్పాటుకు వీలులేని వారు షెడ్ చుట్టూ నీటిలో తడిపిన గొనె సంచులను ఉంచడం ద్వారా షెడ్ లోపలకి వెళ్లే గాలి చల్లగా అవుతుంది. షెడ్ నిర్మాణాన్ని తూర్పు పడమరగా నిర్మించడం ద్వారా షెడ్ లోపల గాలి ప్రసరణ బాగా జరిగి వేసవి తీవ్రతను తగ్గిస్తుంది.
వేసవి కాలంలో పాడిపశువుల రైతులను వేదించే మరో సమస్య తాగునీటి లభ్యత. పశువులకు ఎల్లవేళలా పరిశుభ్రమైన తాగునీరుని అందించాలి. నీటి అందించడంలో విఫలమైతే పాలఉత్పత్తి చాల వరకు తగ్గిపోతుంది. కనుక నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పశువులకు అవసరమైన నీటిని అందించే ప్రయత్నం చెయ్యాలి. పశువుల్లో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి వేసవి కాలంలో రోజుకు కనీసం రెండు సార్లు నీటిలో కడగాలి.
పశువులు నీటిని ఎక్కువ తాగడం వలన దాణా చాల తక్కువ తీసుకుంటాయి, కనుక దాణాలో నీటిని కలిపి ఇవ్వడం ద్వారా పశువులు దాణాను ఇష్టంగా తినడమే కాకుండా నీటి అవసరం కూడా పూర్తవుతుంది. వేసవి సమయంలో ప్రతిరోజు దాణాని తెల్లవారుజామున ఒకసారి మరియు సాయంత్రం వాతావరణం చల్లబడిన తర్వాత ఒకసారి ఇస్తే పశువులు దాణాను వృధా చెయ్యకుండా తింటాయి. వేసవి సమయంలో పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది అందుచేత, దాణాలో అధిక మాంశకృతులు, మరియు ఇతర పోషకాలను అందించడం ద్వారా పశువులను రోగాల భారినుండి కాపాడుకోవచ్చు. వాతావరణంలోని వేడికి పాలు తొందరగా పాడయ్యే అవకాశం ఎక్కువ, కాబట్టి పాలు తీసిన వీలైనంత తొందరగా కేంద్రాలకు తరలించడం అవసరం.
పాడిపశువుల్లో వేసవి తీవ్రత తగ్గడానికి పశువులకు ఇచ్చే మేతలో లేదా దాణాలో బి-కాంప్లెక్స్, మినరల్ మిక్సచర్ కలిపి ఇవ్వడం ద్వారా పాల దిగుబడి పెరుగుతుంది. పశువులను మేతకు ఆరుబయట విడిచేందుకు పగలు 10 గంటలలోపు కానీ, సాయంత్రం 4 గంటల తర్వాత మంచి సమయం. పశువుల పోషణలో ఎందుమేతతో పాటు పచ్చి మేత కూడా చాల అవసరం, ప్రతీ పశువుకు ఒకరోజుకు 20-25 కేజీల పచ్చిమేత అవసరం. అయితే వేసవి సమయంలో పచ్చి మేత లభ్యత తక్కువుగా ఉంటుంది. రైతులు దీనిని దృష్టిలో ఉంచుకుని, బహువార్షికా పచ్చిమేత పంటలు కానీ, లేదా నీరు తక్కువ అవసరమయ్యే మొక్కజొన్న పంటలు పెంచడం ద్వారా వేసవిలో పచ్చిమేతకు కొదువ ఉండదు. పచ్చి గడ్డి దొరకని పక్షంలో మాగుడి గడ్డిని లేదా యూరియా వరి గడ్డిని పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా ఇవ్వవచ్చు.
Read More:
Share your comments