
పీఎం కిసాన్ పథకం నుండి విడుదలయిన డబ్బులు, అనర్హుల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రామ్ నాథ్ మండిపడ్డారు. అతిత్వరలోనే తప్పుదారిపట్టిన అన్ని నిధుల్ని వెనక్కి తీసుకువస్తామని హామీఇచ్చారు. ఇప్పటికే 416 కోట్ల నిధులు జప్తుచేసుకున్నట్లు వెల్లడించారు. రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచేందుకు 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో PM-KISAN పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందించబడుతోంది. ప్రతి సంవత్సరం మూడు సమాన వాయిదాల్లో 2,000 రూపాయిల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది. అయితే చాలా మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పూర్తి డాక్యూమెంట్లు లేని వారు కూడా ఈ పథకాన్ని వాడుకోవటంతో, నిధులు తప్పుదారి పట్టాయి.
ఈ పథకం ద్వారా 19 వాయిదాల్లో దేశవ్యాప్తంగా రూ. 3.68 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేశారు. ప్రత్యక్ష లబ్ధిదారు బదిలీ (DBT) విధానం ద్వారా నిధులను బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పూర్తి పారదర్శకతను కొనసాగిస్తున్నారు.
అనర్హులు నిధులను పొందడం – కఠిన చర్యలు
ఈ పథకాన్ని పూర్తిగా అర్హులైన రైతులకే అందించేందుకు ఆధార్-లింక్ బ్యాంక్ ఖాతా, భూమి ధృవీకరణ, e-KYC వంటి నిబంధనలు అమలు చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వాడే అర్హత లేదు. అలానే ల్యాండ్ సీడింగ్, e-KYC పూర్తి చేయకుండానే ఈ రాయితీలు పొందాలన్నా సాధ్యం కాదు. కానీ చాలా మంది అనర్హులు, ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ నిధుల్ని పొందుతున్నారని తెలుసుకుంది.
ఈ క్రింద ఉన్నవారిని PM KISAAN పథకం నిధులు పొందటానికి అనర్హులు;
- ప్రభుత్వ ఉద్యోగులు
- ప్రైవేటు ఉద్యోగులు
- ఆదాయపు పన్ను చెల్లించే రైతులు,
- రాజ్యాంగ హోదాదారులు
ప్రస్తుతం వీరందరికి బెనిఫిట్లు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వీళ్ళ దగ్గరనుండి ఇప్పటివరకు రూ. 416 కోట్ల అనర్హ బదిలీని తిరిగి వసూలు చేసారని, అర్హత నిబంధనలు పూర్తి చేసిన రైతులకు తక్షణమే పాత బకాయిలతో పాటు నిధుల విడుదల జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాజ్యసభలో సెలవిచ్చారు.
PM-KISAN పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది.
- PM-KISAN పోర్టల్ & మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్-రిజిస్ట్రేషన్, లబ్ధి స్థితి ట్రాకింగ్ సౌకర్యం.
- ఫేస్ స్కాన్ ఆధారిత e-KYC – 2023 జూన్‌లో ఈ విధానాన్ని మొదలుపెట్టారు.
- 5 లక్షల CSC (Common Service Centers) కేంద్రాల ద్వారా నమోదు & ధృవీకరణ సౌకర్యం.
- Kisan-eMitra AI చాట్‌బాట్ (2023 సెప్టెంబర్‌లో ప్రారంభం)
- గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మెకానిజం
అర్హులైన రైతులను చేరువ చేసే ప్రయత్నాలు
2023 నవంబరు 15 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో 1.5 కోట్ల కొత్త అర్హులైన రైతులను చేర్చారు.
PM-KISAN & KCC అనుసంధానం ద్వారా రైతులకు సులభంగా రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. PM-KISAN పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతును అందిస్తూ, వ్యవసాయ పెట్టుబడులను పెంచే ప్రధాన పథకంగా నిలిచింది. అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
Share your comments