బీరకాయ సాగు రైతులకు మంచి ఆదాయం ఇస్తుంది. మార్కెట్లో కూడా బీరకాయకు మంచి గిరాకీ ఉంది. పైగా బీర పంట కేవలం మొ=ముప్పై రోజుల్లోనే కోతకు వస్తుంది. ఐతే బీర పంట చాలా సున్నితమైనది, పంట కాలంలో ఎన్నో జాగ్రతలు పాటించవలసి ఉంటుంది లేదంటే నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
బీరకాయ సాగు చేసే రైతులు ఎక్కువుగా ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేసిన రకాలను సాగు చెయ్యడనికి మక్కువ చూపుతున్నారు. అయితే బెంగళూరులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆర్కా ప్రసన్ బీర వంగడం గురించి అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. ఆర్కా ప్రసన్, ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్ విత్తనాలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుందని రైతులు చెబుతున్నారు. పైగా ఆర్కా ప్రసన్ రకం విత్తనాల ధర ప్రైవేట్ కంపెనీల విత్తనాలతో పోలిస్తే చాల తక్కువు.
సాధారణంగా ఒక ఎకరం బీర సాగు చెయ్యడానికి 1 కేజీ విత్తనాలు అవసరం. బయట మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఒక కిలో బీర విత్తనాలను దాదాపుగా 10,000-11,000 రూపాయలకు విక్రయిస్తుంటే, ఆర్కా ప్రసన్ విత్తనాలు కేవలం 11,000 రూపాయలకు లభిస్తున్నాయి, తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. ఆర్కా ప్రసన్ విత్తనాలు ద్వారా పండించిన బీరకాయలు పొడవుగా మరియు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. ఈ రకం విత్తనాలకు 90% మొలకెత్తె సామర్ధ్యం ఉంది.
విత్తనాలను నాటే ముందు, మట్టిని చదును చేసుకుని వరుసలను సిద్ధం చేసుకోవాలి. ప్రతి వరుసకు మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండే విధంగా జాగ్రత్త పాటించాలి. బీర పంటకు డ్రిప్ విధానంలో లేదా బోదెల ద్వారా నీటి వసతిని అందించవచ్చు. నీటి లభ్యత తక్కువుగా ఉండే ప్రాంతాల్లో డ్రిప్ విధానాన్ని పాటించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు. డ్రిప్ వ్యవస్థ ఏర్పరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకోండి. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి కీలకం, విత్తన శుద్ధి మొక్క ఎదిగే సమయంలో వచ్చే వేరు మరియు కాండం కుళ్ళును నివారిస్తుంది. దీని కోసం ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు, కాప్టాన్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి విత్తనాలను ఈ మిశ్రమంలో నానబెట్టాలి.
ఇలా సిద్ధం చేసుకున్న విత్తనాలను డ్రిప్ వ్యవస్థతో సాగు చేసే వారు ప్రతీ డ్రిప్పర్ వద్ద ఒక విత్తనాన్ని నాటుకోవాలి, ప్రతీ మొక్కకు మధ్య ఒక అడుగు దూరం ఉండేలా చర్యలు చేపట్టాలి. విత్తనం మొలకెత్తేందుకు 4-5 రోజుల సమయం పడుతుంది. మొక్క ఎదిగే దశలో కలుపు నివారణ ఎంతో కీలకం. డ్రిప్ విధానంలో నీటిని అందించేవారు మొక్క ఎదిగే దశలో రోజుకు కనీసం ఒకటిన్నర గంటల సేపు నీటిని విడిచిపెట్టాలి. 35 రోజుల తర్వాత రోజుకు కనీసం నాలుగు గంటలు నీటిని వదలాలి. బోదెల ద్వారా నీటిని అందిచే వారు, మట్టిలోని తేమ శాతాన్ని బట్టి వారానికి కనీసం 2-3 సార్లు నీటిని అందిచాలి.
బీర పాదులకు పందిరి అవసరం, ఈ పాదును నేల మీద పెరగనిస్తే పంట దిగుబడి తగ్గుతుంది. మొక్క ఎదిగే సమయంలో పందిర్లు ఏర్పాటు చేసి వీటి మీద మొక్కలు పెంచితే మంచి నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. ఆర్కా ప్రసన్ రకం బీర మొక్కలకు చీడపీడలను తట్టుకుని నిలబడగలిగే సామర్ధ్యం ఉంది. అయితే చీడ పీడలు రాకుండా నివారించడం ద్వారా ఆశించిన రీతిలో దిగుబడి పొందవచ్చు. చీడపీడల నివారణకు విత్తనం మొలకెత్తిన పది రోజుల తర్వాత మాంకోజెబ్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బీర మొక్కలో వైరస్ తెగులు రావడానికి పురుగులు ముఖ్య కారణం అందులోనూ తెల్ల దోమ ఈ వైరస్ తెగులును మోసుకువస్తుంది, పురుగులను నివారించడానికి, వేప నూనె 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి, .మలాథియాన్ లేదా క్లోరోపైరీపోస్ 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.
Share your comments