పంటలు బాగా పెరిగి మంచి దిగుబడి రావడానికి, ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండాలి, దీనికన్నా తక్కువ లేదా ఎక్కువ ఉన్నాసరే పంట ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. మట్టిలో లవణాల శాతం ఎక్కువగా ఉంది, ఉదజని సూచిక 7.5 కంటే ఎక్కువ ఉంటె అటువంటి భూములను చౌడు భూములుగా పరిగణిస్తారు. చౌడును తట్టుకొని నిలబడగలిగే పంట రకాలు చాలా తక్కువ ఉన్నాయి. అధిక శాతం పంటలు చౌడు భూముల్లో పెరిగిన్నపుడు మాడిపోవడం లేదంటే చనిపోవడం జరుగుతుంది.
మన రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తం ఎక్కువ విస్తీరణంలో పండించే పంటల్లో వరి ప్రధానమైనది. వరి పంటకు అనువైన వాతావరణం లేకుంటే దిగుబడి చాలావరకు తగ్గిపోతుంది. సాధారణ వరి వంగడాలకు ఉప్పు నీరు తగిలినప్పుడు ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారిపోయి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే ఉప్పునీటిలో కూడా పెరిగే వరి వంగడాలు చాలానే ఉన్నాయి. వాటిలో కేరళ తీరప్రాంతాల్లోని, లోతట్టు మాగాణుల్లో, ఉప్పు నీటిలో సైతం పెరిగే పొక్కిలి వరి వంగడం ఒకటి. ఈ రకం ఉప్పు నీటిని సైతం తట్టుకొని నిలబడగలదు. అయితే ఉప్పు నీటిలో ఈ రకం ఎలా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు పరిశోధన జరపగా, ఇక్కడి మట్టిలో సూడోమోనాస్ తైవాన్సిస్ అనే కొత్త రకం బాక్టీరియాని కనుగొన్నారు. ఈ బాక్టీరియా కారణంగానే చౌడు భూముల్లో సైతం మొక్కలు పెరుగుతున్నాయని కనుగొన్నారు.
కేరళలో ఇప్పటికీ సాంప్రదాయ వరి వంగడాలనే సాగు చేస్తుంటారు. సాంప్రదాయ వంగడాలు భిన్నమైన వాతావరణ పరిస్థితులను మరియు చాలారకాల చీడపీడలను తట్టుకొని నిలబడగలవు. సాంప్రదాయ వరి వంగడాలు ఉప్పునీటిని ఒక స్థాయివరకు తట్టుకోగలవు. అయితే కేరళలోని కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకానికి ఉప్పునీటి బెడద చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో చౌడు సమస్యను తట్టుకోగలిగే సూడోమోనాస్ తైవాన్సిస్ (పికె 7) బాక్టీరియా ఉపయోగించి పంట ఎదుగుదల ఎలా ఉందొ అధ్యయనం జరిపీచుశారు. దీనితోపాటు పంట ఎదుగుదలకు సహాయంచేసే రిజోబాక్టర్ తో కూడా ప్రయోగాత్మకరంగా పంటను పండించి చూడగా, పికె 7 బాక్టీరియా తో పండించిన పంట 7,595 కిలోల ధాన్యం ఇవ్వగా, ఈ బాక్టీరియా వాడకుండా చేసిన సాగులో 7,344 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనినిబట్టి పికె 7 బాక్టీరియా ఉండటం వలన వరి మొక్కలు చౌడు సమస్యను కూడా తట్టుకొని నిలబడగలవాని తేల్చి చెప్పారు.
కొన్ని పరిశోధన సంస్థలు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఆధారంగా మన దేశంలో 67 లక్షల 30 వేల ఎకరాలు చౌడుబారిందని తేలింది. నాణ్యతలేని సాగు నీటిని వాడటం, అధిక మొత్తంలో ఎరువుల వినియోగం, పారుదల సదుపాయం సమర్ధవంతంగా లేకపోవడంతో చౌడు సమస్య పెరిగిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి చౌడు భూముల విస్తీరణం రెట్టింపవుతుంది. చౌడు భూముల కారణంగా ప్రతిఏటా మన దేశంలో 1.68 టన్నుల పంట దిగుబడిని కోల్పోతున్నాం. ఈ మొత్తం ఎంతోమంది కడుపునింపడానికి ఉపయోగపడుతుంది. చౌడు సమస్య వ్యవసాయాన్ని దెబ్బతియ్యడమే కాకుండా దేశఆర్ధిక పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది. పికె 7 బాక్టీరియా సహాయంతో చౌడు సమస్యను నివారించవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
Share your comments