Kheti Badi

బయోచార్ కంపోస్ట్.... ఉపయోగాలు ఏమిటి?

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో ఎరువులు మరియు పురుగుమందులు వలన కలిగే హానిని గురించి తెలుసుకున్న రైతులు క్రమక్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో ఈ మధ్య బయోచార్ వినియోగం బాగా పెరిగింది. పంట వ్యర్ధాలు, పశువుల ఎముకలు, మరియు కట్టెపుల్లలతో దీనిని రైతులే సులభంగా పొలం వద్ద తయారుచేసుకోవచ్చు. దీనిని వాడటం వలన కలిగే ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తిగా కాలనీ జీవనవ్యర్ధాల బొగ్గును బయోచార్ అని పిలవవచ్చు. అయితే సాధారణంగా అందరు బయోచార్ పంటకు ఎరువుగా పనిచేస్తుంది అనుకుంటారు, ఆలా అనుకుంటే పొరపాటే. బయోచార్ను మిగిలిన సేంద్రియ ఎరువులతో వేసి ఉపయోగిస్తే ఎరువుల సామర్ధ్యం కనీసం 30-40% పెరుగుతుంది. అంతేకాకుండా చాలా ఏళ్ల నుండి రసాయన ఎరువులను వాడుతుండడం వలన వాటి అవశేషాలు భూమిలో నాటుకుపోయాయి. వీటిని తొలగించే భూమిని తిరిగి యధాస్థితికి తీసుకువచ్చే లక్షణం బయోచార్లో ఉంది. వరి పంట నుండి విడుదలయ్యే మీథేన్ గ్యాస్ వాయుకాలుష్యానికి ప్రధాన కారణం, బయోచార్ ఉపయోగించడం వలన ఈ మీథేన్ గ్యాస్ను కూడా తగ్గించవచ్చు.

మొక్క ఎదుగుదలకు మట్టిలో ఉండే పోషకాల్లో కర్బనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, మొక్క ఎదుగుదలతో పాటు మట్టిలోని ఇతర జీవరాసుల ఉనికికి కూడా ఈ సేంద్రియ కర్బనం అవసరమవుతుంది. అయితే గత కొన్నేళ్ల నుండి మట్టిలోని కర్బన శాతం తగ్గిపోతూ వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం. రసాయన ఎరువుల్లో మొక్కము అవసరమయ్యే పోషకాలు ఉంటాయే తప్ప కార్బన్ ఉండదు, దీనితో కర్బన శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. సేంద్రియ ఎరువులతోపాటు బయోచార్ కలిపి వినియోగిస్తే మట్టిలో కర్బన శాతం పెరుగుతుంది, తద్వారా ఆరోగ్యకరమైన పంటలు పొందడానికి అవకాశం ఉంటుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న బయోచార్ని నల్ల బంగారంగా కూడా పరిగణిస్తారు. బయోచారు మట్టికి ఒక సంపూర్ణ ఆరోగ్య నిధి. రసాయన ఎరువుల వినియోగం మొదలుపెట్టిన తరవత మట్టిలోని సారమంతా పోయి మట్టి నిర్జీవంగా తయారయ్యింది. బయోచార్ తిరిగి మట్టిలో జీవాన్ని పెంచి మట్టిని సజీవం చేస్తుంది. అయితే బయోచార్ తయారుచెయ్యడానికి వినియోగించే కట్టే ముక్కలను అడవులను నరికి వాటిని ఉపయోగించాలి అనుకుంటారు. అది నిజం కాదు, పంట వ్యర్ధాలు, గడ్డి, ఎండిన ఆకులు, విరిగిన కొమ్మలు, వరి పొట్టు ఇలా పొలంలో విరివిగా దిరికే ఎన్నో వ్యర్ధాలను బయోచార్ తయారుచెయ్యడానికి ఉపయోగించవచ్చు. ప్రజల్లో ఉండే మరొక్క సందేహం ఏమిటంటే బయోచార్ తయారుచెయ్యడం వలన దాని నుండి వచ్చే పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది అనుకుంటారు.

బయోచార్ పైరోలైసిస్ అనే పద్దతి ద్వారా తయారుచేస్తారు, సేంద్రియ వ్యర్ధాలను 450 డిగ్రీ సెల్సియస్ నుండి 700 డిగ్రీ సెల్సియస్ వద్ద తగబెడితే బయోచార్ తయారవుతుంది. ఈ ప్రక్రియలో ప్రత్యేక పద్దతి ద్వారా పరిమితంగా గాలి సోకేలా లేదంటే పూర్తిగా గాలి సోకకుండా కట్టే ముక్కలను కాల్చడం ద్వారా పెద్దగా పొగ రాదు. బయోచార్ వినియోగించుకోవాలన్న రైతులు దీనిని నేరుగా తమ పొల్లాలోనే తయారుచేసుకోవచ్చు. ఇందు కోసం ఇనుప డ్రమ్ములు మరియు భూమి అడుగున గుంత తవ్వి కూడా ఈ బయోచార్ సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనిని తయారుచేసుకోవడానికి రైతులకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. బయోచార్ వందల ఏళ్ల పాటు భూమిలోనే ఉంది మట్టిలోని సూక్ష్మజీవరాశులను పెంపొందిస్తుంది.

బయోచార వినియోగిండం ద్వారా సాగు నీటిలో ఏమైనా విషపదార్ధాలు ఉన్నా వాటిని కూడా హారించివేస్తుంది. చాలా మంది బయోచార ఉపయోగించే రైతులు సహజంగా చేసే తప్పుఏమిటంటే బయోచార్ను నేరుగా నేలలో వేస్తారు, ఇలా చెయ్యడం హానికరం కావచ్చు. బయోచార్లో అనేక సూక్ష్మ రంద్రాలు ఉంటాయి. ఇవి మట్టిలోని పోషకాలను పెద్దమొత్తంలో పీల్చుకుంటాయి కాబ్బటి వట్టి బయోచార్ వినియోగించకూడదు. దీనిని పొలంలో వాడేందుకు ముందుగా బయోచార్ కంపోస్ట్ తయారుచేసుకోవాల్సి ఉంటుంది.

బయోచార్ కంపోస్ట్ తయారుచేసుకోవడం కోసం, పశువుల ఎరువు, వెర్మికంపోస్ట్, జీవామృతం, వంటి ఏమైనా సేంద్రియ ఎరువులను బయోచార్ తో కలిపి 15 రోజులపాటు నిల్వచేయాలి, ఈ సమయంలో ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ, దీనిని కలియదిప్పుతూ ఉండాలి. ఇలా తయారైన బయోచార్ ఎరువును పొలంలో వాడుకునేందుకు అనువుగా ఉంటుంది. వరి పైరులో బయోచార్ వినియోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వరి పంట నుండి మీథేన్ అనే పర్యావరణానికి హానికలిగించే వాయువు ఉత్పత్తి అవుతుంది, ఇది వాతావరణ ఉషోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది. వరి పైరులో బయోచార్ వినియోగిస్తే మీథేన్ వాయువును పీల్చుకుంటుంది, దీని వలన పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

Share your comments

Subscribe Magazine