మన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం సాగయ్యే, తీగజాతి పంటల్లో సొరకాయ పంట ఒకటి. ఖరీఫ్ సీజన్లో సాగయ్యే పంటల్లో సొరకాయకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి, రైతులకు అధిక లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. వీటిని కూరల్లోనూ మరియు స్వీట్ల తయారీలోనూ వినియోగిస్తారు. మిగిలిన తీగజాతి పంటలతో పోలిస్తే సొరలో రోగాల బెడద కూడా తక్కువే. దీని పంట కాలం జూన్ మరియు జులై మాసాల్లో మొదలై, నవంబర్ మరియు డిసెంబర్ నెలవరకు కొనసాగుతుంది.
విత్తిన 50 రోజుల నుండే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. అయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే, కాయలు నాణ్యంగా మంచి సైజుతో ఉండాలి. దీని కోసం మెరుగైన యజమాన్య పద్ధతులతోపాటు, నాణ్యమైన రకాలను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. సాధారణ రకాలకంటే, హైబ్రిడ్ రకాలు సాగు చేస్తే పెద్ద పరిమాణంలో కాయలు రావడమే కాకుండా, మంచి దిగుబడి కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. సొర సాగులో ఎటువంటి యాజమాన్య చర్యలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పంటను నేల మీద మరియు పందిరి మీద పాకించి పండించవచ్చు. అయితే తీగ మీద పండించిన్నపుడు దిగుబడి పెరగడంతోపాటు కాయ నాణ్యత కూడా బాగుంతుంది, నీల మీద పండే కాయల్లో తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతోంది, సుమారు 6-7 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సొరకాయను సాగు అన్ని రకాల నేలల్లోనూ అనుకూలమే, చౌడు నేలలు, నీరు నిలిచే నేలలు సాగుకు అనుకూలించవు. ఉదజని సూచిక 6 నుండి 7 వరకు ఉంటే సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో కేవలం మగ పువ్వులు మాత్రమే పూస్తాయి, ఉష్ణోగ్రత 25-30 ℃ ఉన్నట్లైతే పిందెలు మరియు పూలు బాగా వచ్చి దిగుబడి పెరుగుతుంది.
చీడపీడలను తట్టుకుంటూ, మంచి దిగుబడి పొందేందుకు మేలైన హైబ్రిడ్ రకాలను సాగు చేయడం శ్రేయస్కరం. భారత దేశంలోని ఎన్నో పరిశోధన సంస్థలు అనేక రకాల విత్తనాలను అభివృద్ధి చేసాయి, వాటిలో పూస మేఘ్దూత్, పూస మంజరి, పూస నవీన్, అర్కబహార్, సామ్రాట్, పూస సమ్మర్ రౌండ్ పూస సందేశ్ విరివిగా సాగుచేయబడుతున్న రకాలు. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ప్రామాణికమైన రకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఒక ఎకరానికి 500-600 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం నాటే ముందు విత్తనశుద్ధి తప్పకుండా పాటించాలి. ఇందుకోసం ఒక కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోరోఫిడ్ ఒక లీటర్ నీటికి కలిపి విత్తనానికి బాగా పట్టించాలి. విత్తనం ఆరిన తరువాత ట్రైకోడెర్మా విరిడే 5 గ్రాములు విత్తనానికి పట్టించి ఆ తరువాత నాటుకోవాలి. వరుసల మధ్య దూరం 3 మీటర్లు మరియు మొక్కల మధ్య దూరం 90 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలి.
హైబ్రిడ్ విత్తనాలు సాగు చేసే రైతులు ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి, హైబ్రిడ్ మొక్కలకు ఎరువులు అధికంగా అవసరమవుతాయి. భూమిని సిద్ధం చేసే సమయంలో చివరి దుక్కులో, ఒక ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 30 కేజీల భాస్వరం, 24 కిలోల పోటాష్ ఎరువులను పొలం మొత్తం చల్లి, కలియదున్నుకోవాలి. 40 కేజీల నత్రజని ఎరువును రెండు భాగాలూ చేసి మొదటి భాగాన్ని విత్తిన 25 రోజులకి మిగిలిన భాగాన్ని 45 రోజుల తరువాత మొక్కలకు అందించాలి. కాంప్లెక్స్ ఎరువులు మరియు నత్రజని ఎరువులు ఎక్కువుగా ఉపయోగించినట్లైతే పురుగుల బెడద ఎక్కువవుతుందని గుర్తుపెట్టుకోండి.
సొరకాయలను పందిరి పంటగా సాగుచేస్తే అధిక దిగుబడి రావడంతో పాటు, కాయ ఎదుగుదల మరియు ఆకృతి బాగుంటుంది. నేల మీద పండించిన కాయలు వంకర్లు తిరగడం, నెలకు తగిలిన చోట తెల్లగా మారిపోవడం, మరియు రోగాల భారిన పడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పందిరి వెయ్యడానికి జిఐ వైర్లు మరియు వెదురు కర్రల ఉపయోగించుకోవచ్చు. ఎదిగే మొక్కలను కర్రలగుండా పాకిస్తూ, పందిరి మొత్తం పాకించాలి. కాయలను మార్కెట్కు తరచనిచడానికి ప్లాస్టిక్ ట్రే లను ఉపయోగించాలి. అన్ని రక్షణ చర్యలు పాటిస్తే ఒక ఎకరానికి 14 టన్నులవరకు దిగుబడి పొందవచ్చు.
Share your comments