Kheti Badi

మొక్కజొన్నను ఆశించే చీడపీడలు మరియు వాటి నివారణ చర్యలు...

KJ Staff
KJ Staff

మన తెలుగు రాష్ట్రాల్లో వరి తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన పంటల్లో మొక్కజొన్న ఒకటి. మొక్కజొన్న ఉత్పాదకత మిగిలిన పంటలతో పోలిస్తే చాల ఎక్కువ. అయితే మొక్కజొన్న ఎదిగే సమయంలో అనేక చీడపీడలు ఆశించేందుకు అవకాశం ఉంది, దీనివలన దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత కూడా లోపించి మార్కెట్లో మంచి ధర లభించదు. చీడపీడలను ఎదురుకునేందుకు అనేక చర్యలు పాటించవలసి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుముడత తెగులు:

ఈ వ్యాధి మొక్కల కింద ఆకుల నుండి పైన ఉన్న ఆకులకు వ్యాపిస్తుంది. వ్యాధిసోకిన మొక్కల ఆకులు పైన మొదట కోలగా ఉండే బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తాయి, ఈ మచ్చలు క్రమేణా గోధుమ రంగులోకి మారతాయి. వ్యాధి సోకినా మొక్కలు కొద్దీ రోజులకు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

వదల తెగులు:

సేఫేలోస్పోరియం మేడీస్ అనే శిలింద్రం నుండి వ్యాపించే ఈ తెగుళ్లు ఎక్కువగా గింజలు పాల దశలో ఉన్నపుడు రావడం గమనించవచ్చు. వ్యాధి ఆశించిన మొక్కల్లో ఆకులు మొదట ఆకుపచ్చ రంగులోకి మారి తరువాత ఎండిపోయినట్లు కనిపిస్తాయి, ఈ వ్యాధి మొక్కలు పై నుండి కిందకి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు కార్బెన్డిజిమ్ 1.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి, ఈ వ్యాధిని తట్టుకొని నిలబడగలిగే డి.హెచ్.ఎం- 103,105,త్రిశూలత రకాలను సాగుచేయడం ఉత్తమం.

మసి కుళ్ళు:

ఈ తెగులు మొక్కలు పుష్పించే దశ నుండి మొక్క కంకులు ఏర్పడే దశలో గమనించవచ్చు. ఈ వ్యాధి సోకినా మొక్కలో కాండం లోపలి భాగం కుళ్లిపోయి క్రమేపి విరిగిపోతుంది. నాళాలు మరియు కంకులపై నల్లటి బొగ్గు వంటి పొడి ఏర్పడుతుంది, ఇవి శిలింద్రం యొక్క బీజాలు. దీనిని నివారించడానికి మొక్కలు పుష్పించే దశనుండి నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పాటించాలి. ఈ శిలింద్ర మొక్కల అవశేషాల్లో నిలిచి తరువాత సాగు చేసే మొక్కజొన్న పంటకు సోకుతుంది కనుక పంట మార్పిడి పద్దతిని పాటించాలి.

పొడ తెగులు/ మత్త తెగులు

దీనినే బ్యాండెడ్ లీఫ్ అండ్ షీట్ బ్లెయిట్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకినా మొక్కల ఆకు తొడిమలపై రంగు కోల్పోయి పెద్ద చారలు ఏర్పడటం గమనించవచ్చు. ఈ చారల మధ్య ముదురు రంగు చారలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఆకు మాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి 1.5 మిల్లిలీటర్ల ప్రొపికానజోల్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ వ్యాధి నేలనుండి సంక్రమిస్తుంది కాబట్టి నేలకు అనుకుని ఉన్న ఆకులను తొలగించాలి.

కాండం తొలుచు పురుగు:

మొక్కజొన్నను ఖరీఫ్ పంటగా సాగుచేసే రైతులు ఈ పురుగును ఎదుర్కోవాల్సి వస్తుంది. మొక్కలు మొలకెత్తిన 10-15 రోజుల్లోపు తల్లిపురుగు మొక్కలపై చేరి, ఆకుల అడుగుభాగం సమూహంగా గుడ్లు పెడుతుంది, గుడ్ల నుండి బయటకి వచ్చిన పిల్లలు కాండం లోపలి భాగాన్ని మరియు ఆకులను తింటూ పంటకు నష్టం కలిగిస్తాయి, కాండం లోపలి భాగాన్ని తినడం ద్వారా మొవ్వ చనిపోతుంది దీని వలన మొక్కలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. దీనిని నివారించడానికి కార్బారీల్ 50 WP ఒక కేజీ, 500 లీటర్ల నీటికి కలిపి మొక్క ఎదిగిన 20 రోజుల తరువాత పిచికారీ చెయ్యాలి. వీటి గుడ్లను నాశనం చేసేందుకు ట్రైకోగ్రామా అట్టలను పొలంలో ఉంచాలి.

గులాబీ రంగు పురుగు:

ఈ పురుగు ఎక్కువుగా రబీ సీజన్లో మొక్కలను ఆశిస్తుంది. లార్వాలు మొక్కల ఆకుల పై భాగాన్ని గోకి తినడం ద్వారా ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులతో పాటు కాండం లోపలి భాగాన్ని కూడా ఈ పురుగులు ఆశిస్తాయి, దీని వలన చనిపోయిన మువ్వలు తయారవుతాయి. ఈ పురుగును నివారించడానికి, ఈ పురుగు ఆశించిన మొక్కలను పికి నాశనం చెయ్యాలి. పురుగుల ఉదృతి ఎక్కువవకుండా, ఒక లీటర్ నీటికి ఎండోసల్ఫాన్ 2 మిల్లిలీటర్లు కలిపి 15 రోజుల వ్యవధిలో మొక్కలపై పిచికారీ చెయ్యాలి. దీనితో పాటు ఎండోసల్ఫాన్ 4 శాతం గుళికలు మొక్కల సుడులలో వేసి ఈ పురుగులను నియంత్రించవచ్చు.

రసం పీల్చే పురుగులు:

మొక్కజొన్నకు రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. వీటిలో నల్లి, పెను బంక వంటివి ప్రధానమైనవి. మొక్కలు 30 రోజుల దశలో ఈ పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులు ఆకులలో రసం పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారతాయి. అంతేకాకుండా ఈ పురుగులు తేనే వంటి ద్రావణాన్ని విడుదల చెయ్యడం ద్వారా శిలింద్రాల ఉదృతి కూడా పెరుగుతుంది. వీటిని నియంత్రించడానికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లి లీటర్ల ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

Share your comments

Subscribe Magazine