Kheti Badi

జొన్న సాగులో మెళుకువలు:

KJ Staff
KJ Staff
Source: pixabay (DESPIERRES)
Source: pixabay (DESPIERRES)

చిరు ధాన్యాల పంటల్లో అత్యధికంగా పండించే పంటల్లో జొన్న ఒకటి. దీని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తుంటారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఉన్న, జొన్న మన పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిది. జొన్నలను రొట్టెల కొరకు, పశువులకు దాణా గాను, కోళ్లకు మేతగా వాడతారు. వర్షాధారిత పంట గనుక మిగిలిన పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే జొన్న సాగు మెళుకువలను ఇప్పుడు తెల్సుకుందాం.

అనువైన నేలలు:

జొన్న సాగుకు నల్లరేగడి నేలలు లేదా తేలిక పాటి ఎర్ర చల్క నేలలను ఎంచుకోవడం శ్రేయస్కరం.

నీరు ఎక్కువగా నిలిచే నేలలు, లేదా బంక మట్టి నేలలు జొన్న సేద్యానికి సహకరించవు. మెట్ట ప్రాంతాలలో నాటుకునేందుకు అనువుగా ఉంటుంది .

విత్తనాల యజమాన్యం:

జొన్న పంటను వర్షాధారిత పంటగా కానీ, కనీస నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేసుకోవచ్చు.

వర్షాధారిత పంటగా సాగు చేసేందుకు జూన్ చివరివరకు విత్తనాలు విత్తుకోవచ్చు. రబీ పంటగా సాగుకి అక్టోబర్ రెండవ పక్షంలోగా విత్తనాలు నాటడం పూర్తి చెయ్యాలి.

విత్తు నాటే ముందు, విత్తన శుద్ధి చెయ్యడం ద్వారా మొవ్వ ఈగ భారీ నుండి పంటను రక్షించుకోవచ్చు. ఒక కిలో విత్తనానికి 3 gm థియోమీథేక్సమ్, 12 ml ఇమిడాక్లోరోఫిడ్ కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి.

జొన్నలో ముఖ్యమైన రకాలు:

పాలమూరు జొన్న, సి.ఎస్.వి-15 , సి.ఎస్.వి-27, సి.ఎస్.హెచ్-16, సి.ఎస్.హెచ్-25, సి.ఎస్.హెచ్-30 మరియు హైబ్రిడ్ లో సి.ఎస్.వి - 29 ఆర్ , సి.ఎస్.వి-216 ఆర్ కొన్ని జొన్నలోని రకాలు.

ఒక ఎకరానికి 3-4 కిలోల వరకు విత్తనాలు అవసరం ఉంటుంది. వరసల మధ్య 45 cm దూరాన్ని, మొక్కల మధ్య 15cm దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక ఎకరాకు 60,000-75,000 మొక్కలు ఉండాలి.

ఎరువుల వాడకం:

మిగతా పంటలతో పోలిస్తే జొన్న పంట యాజమాన్యంలో ఎరువుల వినియోగం తక్కువ. ఒక ఎకరానికి 3-4 టన్నుల, పశువుల ఎరువుని ఆఖరి దున్ను లో మట్టిలో కలిపి కలియదున్నుకోవాలి. వర్షదార పంటలకు 24కేజీ నత్రజని, 12కేజీ భాస్ఫారమ్, 8కేజీ ల పోటాష్ వాడాలి. నీటి తడి లభ్యత ఉన్న వాళ్ళు, పైన సూచించిన మోతాదుకు రెట్టింపు చేసి వినియోగించాలి. నత్రజని మాత్రం 2 ధపాలుగా పంటకు అందించాలి.

చీడ పీడల నుండి రక్షణ:

 

మొవ్వ తొలుచు ఈగ : ఈ ఈగ జొన్న మొవ్వను ఆశించి, ఎడిపోయేలా చేస్తుంది. మొవ్వ లాగినప్పుడు, సులువుగా వచ్చి కుళ్ళిన వాసన వస్తుంది. దీని నివారణకు కార్బొరల్ 3gm, నీటిలో కలిపి మొక్కకు పిచికారీ చెయ్యవలసి ఉంటుంది.

 

కాండం తొలుచు పురుగు: ఈ పురుగు ఆశించిన మొక్క కాండం కుళ్లిపోయి ఎర్రగా మారుతుంది. మరియు మొవ్వ చనిపోయి తెల్లగా బయటకు వస్తుంది. దీని నివారణకు విత్తిన 30-35 రోజుల్లో కార్బొఫ్యురన్ 3జి గుళికలు మొక్క మొదట్లో వెయ్యాలి.

 

గింజ భుజు తెగులు: గింజ పై నల్లని భుజు ఏర్పడుతుంది. ప్రొపికానోజోల్ 1ml లీటర్ నీటికి కలిపి గింజ ఏర్పడే సమయంలో వాడాలి.

 

బంక కారు తెగులు: వ్యాధి సోకినా గింజల నుండి తియ్యటి జిగురు వస్తుంది. బెనోమిల్ 1gm లీటర్ నీటికి కలిపి కంకులపై చల్లాలి.

కలుపు నివారణ:

జొన్న పంటలో వచ్చే కలుపును నివారించేందుకు, చేతితో కలుపుమొక్కలను నివారించడం శ్రేయస్కరం. కూలీల ఖర్చు ఎక్కువుగా ఉన్న చోట్ల అట్రాజిన్ 50% పొడిని 600gm చొప్పున, 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో పిచికారీ చెయ్యాలి.

హార్వెస్టింగ్ విధానం:

కంకి క్రింద వరుస పచ్చ రంగు నుండి తెలుపు రంగులోకి మారి గింజలోని పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు పంట కోతకు వచ్చింది అని అర్ధం. పంట కోసిన తరువాత గింజలో తేమ శాతం 9-10 ఉండేలా ఎండబెట్టుకుని తర్వాత గొనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine