Kheti Badi

రారండోయ్ 'దొండ' సాగు చేపడదాం....

KJ Staff
KJ Staff

రైతులకు నికర ఆదాయం అందించే పంటల్లో దొండ పంట ఒకటి, అంతేకాదు ఈ పంట ఎక్కువకాలం దిగుబడిని కూడా ఇవ్వగలదు. దొండకాయలో పోషకవిలువలు ఎక్కువుగా ఉండటం మరియు సులభంగా జీర్ణమయ్యే గుణం కలిగిఉంటడం మూలాన వైద్యులు కూడా దొండకాయ తినమని సూచిస్తుంటారు.

దొండ తీగ జాతికి చెందినది, మరియు వేగంగా వ్యాప్తి చెందుతుంది, పంటను ఒకసారి నాటితే కనీసం మూడు-నాలుగు సంవత్సరాలు ఆదాయం పొందవచ్చు. అధిక కాలగమనం కలిగిన పంట గనుక రైతులు శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసుకుని దొండ సాగుచేస్తుంటారు. దొండలో అనేక రకాలున్నాయి, వాటిలో లావు దొండ మరియు పెన్సిల్ దొండ రకాలు ప్రధానమైనవి. మార్కెట్లో లావు దొందకంటే, పెన్సిలు దొండకే డిమాండ్ ఎక్కువ కాబట్టి రైతులు ఈ రకాన్ని సాగుచేసేందుకు మొగ్గుచూపుతారు.

దొండ సాగు చేద్దామనుకునే రైతులు అనేక విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి వాటిలో, మొదటిది మేలైన విత్తన రకాన్ని ఎన్నుకోవడం. దాదాపు అన్ని కూరగాయలను విత్తనాలు నుండి సాగిచేస్తారు అయితే దొండను మాత్రం ఇందుకు భిన్నంగా ముదురు కణుపు ముక్కల నుండి సాగు చేస్తారు. అయితే ఈ దొండ సాగును మొదలుపెట్టడానికి జూన్ మరియు జులై నెలలు అనుకూలం, ఈ సమయంలో తొలకరి చినుకులు పడిన తరువాత వీటి సాగు మొదలుపెడతారు.అయితే దొండ మొక్క అధిక చలిని తట్టుకోలేదు, మన తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలంలోనూ అంత చలి ఉండదుకనుక దొండ సాగుకు అనుకూలం మరీముఖ్యంగా కోస్తాఆంధ్ర ప్రాంతాలు దొండసాగుకు బాగా అనుకూలిస్తాయి.

దొండను అన్ని రకాల నేలల్లోనూ సాగుచేయవచ్చు, నీరు నిలిచే నేలలు, ఆమ్లా నేలలు తప్పించి మిగతా అన్ని నేలల్లోనూ సాగుచెయ్యచ్చు. విత్తనం ఎంచుకునే ముందు మార్కెట్ అవసరాలను బట్టి మరియు వాతావరణ పరిస్థితుల బట్టి ఎంచుకోవాలి. రైతులు దొడ్డు రకాలకంటే, సన్న రకాలకే ప్రాధాన్యతనిస్తారు, వీటిని పెన్సిల్ రకాలు అనికూడా పిలుస్తారు. సాగుకు అనువైన కండపు ముక్కలను ఎంచుకుని వాటిని నేరుగా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు లేదంటే పాలిథిన్ బ్యాగులలో నారుమడిని పెంచి తరువాత నాటుకోవచ్చు. పాలిథిన్ కవర్లలో 25-30 రోజులు పెంచిన మొక్కలు ప్రధాన పొలం నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ప్రతి మొక్కకు మరియు వరుసల మధ్య దూరం 2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. మొక్కలు నాటుకోవడానికి 45 సెంటీమీటర్ల అడుగులో గుంతలు తవ్వి వాటిలో మూడు కేజీల పశువుల ఎరువు, 250 గ్రాముల వేపపిండి కలిపి మొక్కలు నాటుకోవాలి.

దొండ సాగులో నీటి యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మట్టిలోని తేమను బట్టి నీటిని అందించాలి, మొక్క మోడళ్లలో నీరు నిలిచినట్లైతే వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మొత్తం మూడు దశల్లో నీటి ఎద్దడి లేకుండ జాగ్రత్తలు వహించాలి, పూత, పిందె, మరియు కాయ పెరుగుతున్న సమయంలో సరైన మొత్తంలో నీటిని అందించాలి. నీటిని పొలం మొత్తం పారించడంకంటే, బిందుసేద్యం ద్వారా నీటిని అందించడం ఉత్తమం, ఈ పద్దతిలో నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు.

దొండ సాగు చేపట్టే రైతులు, మొక్కలు నాటుకుని ముందే అంటే జూన్ లేదా మే ఆఖరిలోనే మట్టిని చదును చేసుకోవాలి, ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. ఇదే సమయంలో ఎకరాకు 35 కిలోల భాస్వరం, 18 కిలోల పోటాష్ ఎరువులను వేసి మట్టిలో కలియదున్నాలి. అలాగే యూరియా ఎరువు 40 కేజీల వరకు అవసరం, దీనిని రెండు భాగాలుగా విడదీసి, మొక్కలు నాటిన 25-30 రోజుల మధ్య ఒక భాగం మరియు మొక్కలు, పూత-పిండే దశలో ఉన్నపుడు మరోక్కభాగం అందించాలి. ఎరువులు వేసిన తర్వాత క్రమం తప్పకుండ నీటిని అందించాలి.

శాశ్వత పందిరి వేసే రైతులు భూమికి ఐదు అడుగుల ఎత్తులో పందిరిని వెయ్యాలి. ఈ పందిరి వెదురు కర్రలు లేదా సిమెంట్ స్తంబాలు ఏర్పాటు చేసుకుని, జిఐ వైర్ల సహాయంతో పందిరిని ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలు ఎదిగి తీగలు పొలం మొత్తం వ్యాపించక, పురుగులనుండి రక్షణ కల్పించాడని వేప నూనెను పొలం మొత్తం 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. అలాగే పురుగుల ఉదృతి ఎక్కువుగా ఉన్నట్లైతే లీటర్ నీటికి 2 మి.లీ ఫ్రోఫెనోఫోస్ పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తూ దొండ నుండి మేలైన దిగుబడులు పొందవచ్చు. ఎకరానికి 50-60 టన్నుల దిగుబడి వస్తుంది.

Share your comments

Subscribe Magazine