కరివేపాకు ఒక వాణిజ్య సుగంధ భరితమైన ఆకుకూరల పంట. ప్రస్తుతం మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ మొక్కలు ఒకసారి పెంచితే చాలు.. చాలా సంవత్సరాల పాటు దిగుబడులు అందిస్తాయి.
అందుకే ఏ సీజన్ లో ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై ముందుగానే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
నీటి పారుదల పెద్దగా లేని నేలల్లో కూడా వీటిని వార్షాధారితంగా పండించవచ్చు. ఇవి 16 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. ఈ పంట పెంచడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం..
కరివేపాకు పండించే నేలలు
కరివేపాకు పంటకు మరీ ఎక్కువగా నీరు అవసరం ఉండదు. అందుకే నీరు నిల్వ ఉండని నేలలు దీనికి అవసరం. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. డీడబ్ల్యూడీ 1, 2 రకాల కరివేపాకు మొక్కలు బాగా దిగుబడిని అందిస్తూ ప్రాచుర్యం సాధించాయి. ఈ రెండు రకాలు మంచి సువాసన కలిగి ఉంటాయి. అయితే డీడబ్ల్యూడీ 1 రకం చలిని తట్టుకోలేదు. డీడబ్ల్యూడీ 2 రకం చలిని కూడా తట్టుకోవడం కాకుండా మంచి దిగుబడిని కూడా అందిస్తుంది. ఇవి కాక సువాసిని, భువనేశ్వర్, సెంకంపు వంటివి దేశవాళీ రకాలు. వీటిని కూడా పెంచవచ్చు. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
సాగు విధానం
కరివేపాకు విత్తనాలు నాటుకునే ముందు పొలంలో బోదెలు చేసుకోవాలి. వీటి మధ్య దూరం 2.5 అడుగులు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను వీటికి రెండు వైపులా నాటుకోవాలి. ఈ పంటను ఎక్కువగా విత్తనాల ద్వారానే సాగు చేస్తారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు నాటుకోవచ్చు. లేదా పెద్ద చెట్టు పక్కన వచ్చే పిలకలు నాటాలంటే వర్షా కాలంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎకరానికి 70 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు సేకరించగానే నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు నాటే ముందే ఎకరానికి 26 కేజీల నత్రజని, 5 కిలోల ఫాస్పరస్, 6 కిలోల పొటాషియం వేసుకోవాలి. విత్తనాలు నాటుకున్న తర్వాత బోదెలపై గడ్డి కప్పి రోజుకు రెండుసార్లు నీటితో తడుపుకోవాలి. ఇలా చేయడం ప్రారంభించిన 15 నుంచి 20 రోజులకు విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ తర్వాత వారానికోసారి వీటిని నీటిని అందించాల్సి ఉంటుంది. ప్రతి నాలుగు నెలలకోసారి కాంప్లెక్స్ ఎరువులు చల్లుకోవడం, నాటిన ఆరు నెలలకు నత్రజని 8 కేజీలు వేసుకోవడం చేయాలి. మొక్కలు ఒక ఫీట్ వరకు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచడం వల్ల అవి మరీ ఎత్తుకు ఎదగకుండా కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మొక్కలు గుబురుగా పెరుగుతాయి.
కోత కోయడం, దిగుబడి
విత్తనాలు నాటిన ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్యలో తొలి పంట చేతికి వస్తుంది. విత్తనాలు నాటిన సమయంలో తప్ప ఈ పంటకు పెద్దగా ఖర్చు ఉండదు. ఎరువులు కూడా పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. మొదటి కోతలో దిగుబడి తక్కువగా ఉంటుంది. మొదటి సంవత్సరంలో మాత్రం రెండు కోతలు వస్తాయి. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత కోసుకునే వీలుంటుంది. ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉండడం దీని ప్రత్యేకత. అయితే కోత కోసిన ప్రతిసారి కలుపు మొక్కల్ని కూడా తొలగించాల్సి ఉంటుంది.
చీడ పీడలు, జాగ్రత్తలు
కరివేపాకులో చీడ పీడలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వర్షా కాలంలో ఆకు మచ్చ తెగులు వల్ల ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొమ్మలు కట్ చేసి వదిలేయడం వల్ల తిరిగి ఆరోగ్యకరమైన ఆకులు వచ్చే అవకాశాలుంటాయి. మరీ ఎక్కువ సమస్య ఉంటే కార్బండిజంని లీటర్ నీటికి గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు, పొలుసు పురుగులు కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. గొంగళి పురుగులు ఆకులను తింటే పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ రెండింటి వల్ల మొక్క పెరుగుదల తగ్గుతుంది. గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగుల నివారణకు రెండు మిల్లీ లీటర్ల డై మిథియేట్ ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఈ మందుల్లో ఏది ఉపయోగించినా.. ఆ తర్వాత కనీసం 15 రోజుల పాటు ఆగిన తర్వాతే కోత కోయాల్సి ఉంటుంది.
https://telugu.krishijagran.com/kheti-badi/methods-of-growing-green-leafs/
Share your comments