సాధారణంగా ఒంట్లో నలతగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తే కొన్ని టెస్టుల ద్వారా మన ఆరోగ్య స్తితిగతులతో కూడిన ఒక నివేదిక(Test Report) ఇచ్చి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లోని మట్టి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేదే సాయిల్ హెల్త్ కార్డు. అయితే ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటో మరియు ఈ కార్డును ఎలా పొందాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
వ్యవసాయ భూముల్లో మట్టి ఆరోగ్యాన్ని, ఒక నివేదిక రూపంలో తెలియపరిచేదే సాయిల్ హెల్త్ కార్డు. ఈ కార్డు ద్వారా మట్టిలోని స్థూల పోషకాలు అయిన నత్రజని, భాస్ఫారమ్, మరియు పోటాష్ అలాగే మొక్కకు అవసరమయ్యే సూక్ష్మ పోషక విలువలను తెలుసుకోవచ్చు. వీటితో పాటుగా మట్టిలోని పీహెచ్, ఈసీ గుణాన్ని కూడా ఈ నివేదిక ద్వారా పొందవచ్చు. మట్టి గుణానికి తగ్గట్టు పంటలు వెయ్యడానికి మరియు యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
రైతులు తమ పొలంలో సంవత్సరానికి రెండు సార్లు మట్టి పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. రబి మరియు ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మట్టి పరీక్షలు జరపడం ద్వారా, ఆ సీజన్లో పండించ్చబోయే పంటలకు ఎటువంటి పోషకాలు అందించాలి అలాగే మట్టి తత్వాన్ని బట్టి ఎటువంటి పంటలు పండిస్తే అధిక లాభాలు పొందవచ్చో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
భూసార పరీక్షలు, ప్రభుత్వ సంస్థలు, లేదా కొన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షల కోసం ముందుగా పొలం నాలుగు వైపులనుండి మరియు పొలం మధ్య భాగం నుండి 15-20 సెంటీమీటర్ల లోతులో మట్టిని సేకరించి, ఆ మట్టినంతటిని కలిపి దానిలో కొంత భాగాన్ని ల్యాబ్ కి పంపిస్తారు. మట్టిని పరీక్షించిన అనంతరం, మట్టి ఆరోగ్యాన్ని తెలియచేసే సాయిల్ హెల్త్ కార్డు ను రైతులకు అందిస్తారు. భూసార పరీక్ష కోసం 200 రూ. చెల్లించవలసి ఉంటుంది.
రైతులు సాధారణంగా తాము పండించే పంటను బట్టి ఎరువులను సూచించిన పరిమాణంలో వాడుతుంటారు. కానీ మట్టి యొక్క స్వభావాన్ని బట్టి, మరియు పోషక విలువలను బట్టి, ఎరువులను అందించాలి. మొక్క ఎదుగుదలకు స్థూల పోషకాలు ఎంత అవసరమో అలాగే సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరం. సూక్ష్మ పోషకాలు లోపం ద్వారా మొక్కలో అనేక రోగాలు తలెత్తి దుగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డు ద్వారా మట్టిలోని సూక్ష్మ పోషకాలు శాతాన్ని తెలుసుకొని అవసరమైన పోషకాలను అందించవచ్చు. అలాగే అధికంగా వాడుతున్న ఎరువుల వినియోగాన్ని కూడా అరికట్టవచ్చు.
సాయిల్ హెల్త్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, చాల మంది రైతులు దీనిని పొందేందుకు మొగ్గు చూపడం లేదు. వీటికి అనేక కారణాలు ఉన్నాయ్ కానీ భూసార పరీక్షల ద్వారా మొక్కలకు అవసరమయ్యే పోషకాలను ముందుగానే అందించి దిగుబడులను పెంచుకునే వీలు ఉంటుంది, కాబట్టి మీ పొలాల్లో భూసార పరిక్షలు నిర్వహించి మీ ఉత్పాదకతను పెంచుకోండి.
Share your comments