Kheti Badi

శనగలో అధిక దిగుబడినిచ్చే రకం... అధిక దిగుబడి సాధ్యం....

KJ Staff
KJ Staff

పప్పుధాన్యాల్లో శనగ కూడా ఒకటి. ప్రతీ ఏటా రబీ సీజన్లో ఈ పంటను సాగు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ పంటగా కూడా సాగవుతోంది. మన దేశంలో శనగను, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువుగా సాగు చేస్తారు. అయితే శనగను సాగు చేసే రైతులు కొన్ని రకాల చీడపీడల వలన నష్టాలను చవిచూస్తున్నారు. అంతేకాకుండా దిగుబడిలోనూ తగ్గుదల కనిపించడంతో, శెనగ సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. రైతుల ఆదాయం పెంచి అధిక దిగుబడినిచ్చే కొత్త శెనగ వంగడాన్ని నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం విడుదల చేసింది.

శనగలో అధిక దిగుబడులే లక్ష్యంగా, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ' నంద్యాల గ్రామ్ 857' అనే పేరుతో కొత్త రకం శనగ వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకాన్ని సాగు చెయ్యడం ద్వారా రైతులకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి, మొదటిగా అధిక దిగుబడులు పొందడం, మరొక్కటి చీడపీడలను తట్టుకొని నిలబడటం. దీని వలన రైతులకు పెట్టుబడి భారం తగ్గడంతో పాటు ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

అఖిలభారత సమన్వయ పథకం ద్వారా నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం వారు మూడు సంవత్సరాలు కృషి చేసి నంద్యాల గ్రామ్ 857 రకాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పటివరకు లభిస్తున్న రకాలకంటే ఎక్కువ దిగుబడి సామర్ధ్యం మరియు చీడపీడలను తట్టుకునే గుణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గింజ నుండి పప్పు శాతం 75% ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక 100 గింజల బరువు సుమారు 234 గ్రాములు వస్తుంది, కనుక రైతులకు అధిక లాభాలు చేకూర్చుతుంది. దీనితోపాటు గింజలో ప్రోటీన్ శాతం 21.7 గా ఉంది.

మిగిలిన రకాలతో పోలిస్తే ఈ రకం పంట కాలం కూడా తక్కువ. ఈ వంగడం యొక్క పంటకాలం 95 నుండి 100 రోజులు ఉంది. ఈ రకాన్ని సాగు చెయ్యడానికి దక్షిణ భారత దేశ ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రకం విత్తనాల పంపిణి ప్రారంభం కాగా, గింజ నాణ్యత, పరిమాణం, మరియు ఆకర్షనియ్యాత బాగుండడంతో ఎంతో మంది రైతులు ఈ వంగడాన్ని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నంద్యాల గ్రామ్ 857 రకాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక మరియు తమిళ్నాడు లోని రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ కొత్త వంగడం తమకు ఎంతో మేలుచేస్తుందని ఎంతోమంది రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine