దేశంలో పంటల వైవిద్యం పెరిగినప్పుడే ఆహార భద్రత కూడా పెరుగుతోంది. రైతులంతా కేవలం ధాన్యం లేదా పప్పు దినుసుల మీదనే ద్రుష్టి పెడితే ఆహార కొరత మరియు పోషక కొరత ఏర్పడుతుంది. రైతులంతా సీసన్ కి తగ్గట్టు, వివిధ పంటలను సాగుచేసినట్లైతే ఒకవైపు మట్టి ఆరోగ్యం మరో వైపు ఆహార భద్రత పెంపొందుతుంది. తక్కువ ఖర్చు మరియు పంట ప్రారంభించిన కొద్దీ కాలంలోనే దిగుబడిని అందించగలిగేవి కూరగాయ పంటలు.
కూరగాయ పంటల యాజమాన్యం ఇతర ధాన్యం పంటల సాగుకంటే సులభం. వీటికి డిమాండ్ అన్ని కాలాల్లో ఉండటం చేత ఆశించిన లాభాలను కూడా పొందవచ్చు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో వీటికి అధిక డిమాండ్ ఉంటుంది. అయితే వేసవిలో కూరగాయలు పండించే రైతులకు నీటి సమస్యతో పాటు చీడ పీడల సమస్య కూడా ఎక్కువుగా ఉంటుంది. వీటిలో రసం పీల్చే పురుగులు అతి ప్రధానమైనవి. ఇవి మొక్క దిగుబడిని ఇచ్చే సమయానికి మొక్కలను ఆశించి పూర్తి నష్టం కలిగిస్తాయి. కాయగూరలతో పాటు ఆకుకూరలకు కూడా వీటిని నుండి ముప్పు పొంచి ఉంది.
రసం పీల్చు పురుగులలో అనేక రకాలున్నాయి, వీటిలో తెల్ల దోమ, తామర పురుగులు, పెను బంక, నల్లులు మొక్కలోని రసాన్ని పీల్చి మొక్క ఎదుగుదల తగ్గడానికి కారణమవుతాయి. వీటి వల్ల మొరొక్క ప్రమాదం ఏమిటంటే ఈ పురుగులు వాటితో పాటు వైరస్ తెగుళ్లను మోసుకువస్తాయి, వైరస్ వ్యాధి అంటువ్యాధి కాదు, వైరస్ సోకినా మొక్కల నుండి ఈ పురుగులు రసాన్ని పీల్చి మొరొక్క మొక్క వద్దకు చేరి ఆ మొక్కకి కూడా ఈ వైరస్ తెగుళ్లను వ్యాపింప చేస్తాయి. రసం పీల్చు పురుగులను నియంత్రించగలిగితే మొక్కలకు వైరస్ వ్యాధి సోకకుండా రక్షించవచ్చు.
మొక్కలను రసం పీల్చు పురుగుల నుండి కాపాడటానికి సస్యరక్షణ చర్యల్లో భాగమైన ఎన్నో పద్దతులున్నాయి వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల దోమ, పెను బంక, మరియు తామర పురుగులు ఆకుల వెనుకభాగంలో ఉంటూ మొక్కలోని పోషకాలను పీలుస్తాయి. ,మొక్కల ఆకులు ముడుచుకుపోయినట్టు లేదా వాడిపోయినట్టు ఉంటే వీటి ఉనికిని గుర్తించవచ్చు. మొక్కఎదిగే దశలో పోషకాలను ఈ పురుగులు పీల్చడం వలన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. అంతేకాకుండా అన్ని ఈ పురుగులు మొక్క యొక్క అన్ని దశల్లోనూ ఆశిస్తాయి కనుక రైతులు పంట కాలం పూర్తయ్యేవరకు సమగ్ర రక్షణ చర్యలు పాటించాలి.
వీటిని పురుగుమందులతో కంటే సేంద్రియ పద్దతుల ద్వారా నియంత్రించడం ఉత్తమం. వీటి నివారణకు పురుగుమందులు అధిక మొత్తంలో అవసరం ఉంటాయి, తద్వారా రైతుల మీద అధిక భారం పడుతుంది. దీనితో పాటు పురుగుమందుల అవశేషాలు కాయగూరలపై మిగిలిపోయి ఆరోగ్య నష్టం కలిగిస్తాయి. తెల్ల దోమను అడ్డుకోవడానికి మరియు వాటి ఉనికిని గుర్తించడానికి ఒక ఎకరంలో 10 పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి, అలాగే తామర పురుగుల కొరకు నీలం అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. రసం పీల్చే పురుగులకు వేప నూనే సమర్ధవంతంగా పనిచేస్తుంది. కానీ వేప నూనేని వాడే రైతులు కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే వేప నూనే ఒకేసారి అధిక మోతంలో వాడటం వలన ఆకులు ఎడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక లీటర్ నీటికి 5 ml వేప నూనేని కలిపి, నూనె నీటిలో కరిగేందుకు సోప్ లేదా డిటర్జెంట్ నీటిలో కలపవలసి ఉంటుంది.
వేప నూనే లేదంటే వేప కాషాయం మొక్కలపై 10-15 రోజులకు ఒకసారి మొక్కలపై పిచికారీ చెయ్యాలి, దీని వల్ల పురుగులతో పాటు వారి గుడ్లు కూడా నశిస్తాయి. రసం పీల్చు పురుగుల ఉదృతి రాత్రి వేళల్లో అధికంగా ఉంటుంది, కనుక పొలాల్లో కంటి ఎరలను అమర్చడం ద్వారా పురుగులు కాంతికి ఆకర్షింపబడి లైట్ కింద బుట్టలో ఉంచిన నీటిలో పడి మరణిస్తాయి. సాధారణంగా పురుగుల ఉదృతి నియంత్రించలేని స్థితిలో ఉన్నపుడు మాత్రమే పురుగుమందులను వాడాలి, పంటా కోతకు వచ్చిన సమయంలో పురుగుమందులు వాడరాదు, కోత కొయ్యడం పూర్తయ్యాక లేదా కోతకు కనీసం 10 రోజుల సమయం ఉన్నపుడు మాత్రమే పురుగుమందులు వాడాలి.
తెల్ల దోమ నివారణకు 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోప్రిడ్ ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి. మరియు తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 ml ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చెయ్యాలి. చివరిగా పేనుబంక నివారణకు 2 మిల్లి లీటర్ల డైమిథోయతే ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా సమగ్ర రక్షణ చర్యలు పాటిస్తూ వేసవిలో కూరగాయల మొక్కలను రసం పీల్చు పురుగుల నుండి రక్షించుకోవాలి.
Share your comments