Kheti Badi

తక్కువ సమయంలో పండే కూరగాయలు.

KJ Staff
KJ Staff
Home Gardening.
Home Gardening.

ప్రస్తుతం చాలామంది టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ అంటూ చాలా తక్కువ స్థలం ఉన్నా సరే.. కూరగాయలు పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనికి కూరగాయలకు ఎక్కువగా ఉపయోగించే రసాయన ఎరువులు కూడా కారణమే. తమ కళ్ల ఎదురుగా తాము పండించుకొని ఆ కూరగాయలను తాము తింటే చాలామందికి ఆనందంగా అనిపిస్తుంది. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా మన ఇంట్లోనే పెంచుకున్న కూరగాయలు తినడం వల్ల అవి ఫ్రెష్ గా ఉండగానే తినే వీలుంటుంది. అంతే కాదు.. కెమికల్స్ ప్రభావం తగ్గడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే దీనికోసం కాస్త శ్రమించాల్సి ఉంటుంది. కొద్దిగా కష్టపడి కాస్త సమయం వెచ్చించి కూరగాయలు పండించుకుంటే చాలు.. చాలా రకాల కూరగాయలు చాలా తక్కువ సమయంలోనే పండుతాయి. దీనివల్ల మనకు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండానే కూరగాయలు చేతికి అందుతాయి. పండించడం ప్రారంభించిన తర్వాత ఇలాంటి మొక్కలను మొదటగా వేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కూరగాయలు అందుతాయి కాబట్టి మరింత ఉత్సాహంతో ఈసారి మరో రకం కూరగాయలు కూడా పండించేందుకు సిద్ధమవుతారు. మరి, ఇలా పండేందుకు చాలా తక్కువ సమయాన్ని తీసుకునే మొక్కలేంటి? వాటిని ఎలా పెంచుకోవాలంటే..

ముల్లంగి:

ముల్లంగి పంట చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే వీటిని అంతరిక్షంలోనూ ఎక్కువగా పండిస్తుంటారు. అతి వేగంగా పెరిగే పంటల్లో ఇది ఒకటి. నాటిన మూడు నుంచి నాలుగు వారాల్లో ఈ పంట సిద్ధమైపోతుంది. దీన్ని పెంచడం కూడా చాలా సులభం. కాస్త లోతుగా ఉన్న కుండీల్లో దీని గింజలు వేస్తే సరిపోతుంది. మూడు నుంచి నాలుగు రోజుల్లో మొలకలు కనిపిస్తాయి. మూడు నుంచి నాలుగు వారాల్లో ముల్లంగి గడ్డలు కూడా సిద్ధమవుతాయి.

క్యారెట్:

క్యారెట్ కూడా ముల్లంగి లాగే వేగంగా పెరుగుతుంది. ఈ రెండు చూసేందుకు దాదాపు ఒకేలా ఉన్నా రంగులో మాత్రం తేడా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. క్యారట్ లో కొన్ని రకాలు మాత్రమే వేగంగా పెరుగుతాయి. ఫింగర్ సైజ్డ్ వెరైటీ ఎంచుకోవడం వల్ల కేవలం ఆరు వారాల్లో అద్భుతమైన క్యారెట్ లను పొందే వీలుంటుంది. ఇందుకోసం కుండీలో క్యారెట్ గింజలను వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాని పైన మరో లేయర్ మట్టి వేయడం వల్ల ఇవి వేగంగా పెరుగుతాయి.

పాలకూర:

దాదాపు అన్ని రకాల ఆకుకూరలు వేగంగానే పెరుగుతాయి. కానీ పాలకూర వాటన్నింటికంటే వేగంగా పెరుగుతుంది. ఇది పండేందుకు కేవలం నెల రోజుల సమయం పడుతుంది. దీన్ని పండించేందుకు పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. చిన్న ట్రేలో మట్టి పోసి గింజలను విత్తి రోజూ నీళ్లు అందిస్తే సరిపోతుంది. ముప్ఫై రోజుల్లో పాలకూర సిద్ధంగా ఉంటుంది. ఆలోపే కావాలంటే బేబీ స్పినచ్ ఆకులను సలాడ్స్ కోసం కూడా కట్ చేసుకోవచ్చు.

 

సలాడ్ ఆకుకూరలు:

సలాడ్ లలో ఎక్కువగా ఉపయోగించే కొన్ని రకాల ఆకుకూరలు కేవలం 21 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. అందుకే ఒకవేళ మీకు సలాడ్లు తినడం అలవాటైతే బయట నుంచి తెచ్చుకోకుండా మీ ఇంట్లోనే చిన్న స్థలంలో వీటిని సులభంగా పండించుకోవచ్చు. తద్వారా రసాయనాలు చల్లిన ఆకుకూరలు తింటున్నామేమోనన్న అనుమానం ఉండదు. ఇందులో భాగంగా లెట్యూస్, కేల్, అరుగులా వంటి రకాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు గార్నిషింగ్ కోసం ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి రకాలను కూడా నెల రోజుల లోపే పొందవచ్చు. వీటిని ఇంట్లో ఉంచుకొని రోజు కొద్దిగా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల రోజూ ఫ్రెష్ గా వాటిని పొందే వీలుంటుంది.

దోసకాయలు:

చాలామందికి ఇష్టమైన రకాల్లో దోసకాయలు కూడా ఉంటాయి. ఇందులోనే రెండు రకాలను ఎంచుకోవచ్చు. ఒకటి మామూలు దోసకాయలు, రెండోవి కీరా దోసకాయలు. వీటితో రకరకాల రెసిపీలు చేసుకునే వీలుంటుంది. తీగ జాతికి చెందిన ఈ మొక్క పెరిగేందుకు కాస్త ఎక్కువ స్థలమే కావాల్సి ఉంటుంది. అయితే దీన్ని పైకి ఎక్కించి కాయలు కోసుకునే వీలు కూడా ఉంటుంది. ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. కేవలం గింజలు వేసి రోజూ నీళ్లు పోస్తే చాలు.. ఏడు వారాల్లో చిన్న సైజు దోసకాయలు కోసుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. కాస్త పెద్దగా కావాలంటే మరో వారం ఆగితే సరిపోతుంది.

 

బెండకాయలు:

చాలామందికి ఇష్టమైన కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయ తింటే బ్రెయిన్ పెరగడం మాట అలా ఉంచితే మార్కెట్లో దొరికే బెండకాయల్లో ఏవి మంచివో.. ఏవి ముదిరిపోయినవో వెతుక్కోవడం కష్టం. కానీ ఇంట్లోనే వీటిని పెంచుకోవడం వల్ల తాజా బెండకాయలను వండుకునే వీలుంటుంది. బెండకాయ గింజలను కుండీల్లో వేసిన తర్వాత వచ్చిన మొక్కలను దూరం దూరంగా నాటుకోవాలి. ఇలా చేసిన తర్వాత రోజూ నీళ్లు, ఎరువులు వేస్తుండాలి. ఇవి మామూలుగా ఏడు నుంచి ఎనిమిది వారాల్లో కోతకు వచ్చేస్తాయి.

బీన్స్:

బీన్స్ కూడా చాలా తక్కువ సమయంలోనే కోతకు వచ్చే పంటగా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ పంటను పండించడం నేలకు కూడా మంచిదట. బీన్స్ లో చాలా రకాలు పెంచడం వల్ల నేలలో నత్రజని పెరుగుతుంది. ఇందులో చాలా రకం బీన్స్ కేవలం 50 రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి. వాటిని నేరుగా వండుకోవడానికి ఉపయోగించవచ్చు.

Share your comments

Subscribe Magazine