ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దళారులతో సంబంధం లేకుండా నేరుగా రైతులు వ్యాపారులకు తాము పండించిన పంటను అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వ్యాపారులు కూడా నేరుగా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం మల్టీపర్పస్ సెంటర్లను నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా నేరుగా ఈ మల్టీపర్పస్ సెంటర్ల ద్వారా రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ఉన్న విషయం తెలిసిందే. వీటికి అనుసంధానంగా ఈ మల్టీపర్పస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాల సమీపంలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాల సమీపంలో మల్టీపర్పస్ సెంటర్ల ఏర్పాటు కోసం 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని అధికారులు సమీకరిస్తున్నారు.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ మల్టీపర్పస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీని కోసం రూ.2,718 కోట్ల వ్యయం కానుండగా.. ప్రభుత్వం రూ.264.2 కోట్ల ఇవ్వనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం రూ.74 కోట్ల సబ్సిడీ రూపంలో ఇవ్వనుండగా.. రూ. 2,351.1 కోట్లు నాబార్డు రుణం ఇవ్వనుంది.
ఈ మల్టీపర్పస్ కేంద్రాల ఏర్పాటు కోసం మార్చిలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించనుండగా.. ఏప్రిల్‌లో పనులు చేపట్టనున్నారు. ఈ మల్టీపర్పస్ సెంటర్లలో గోడౌన్లు, కోల్డ్‌రూమ్స్‌తో పాటు పంటనిల్వ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. రైతులు ఈ కేంద్రాల్లో ఎన్నిరోజులైనా సరే పంటలను నిల్వచేసుకుని తమకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే ప్రభుత్వం ఈ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది.
ఈ-మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్‌కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రైతులు పంటను అమ్ముకోవచ్చు.
Share your comments