కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతోమందినీ నిరాశ్రయులుగా, నిరుద్యోగులుగా మార్చింది. అదేవిధంగా ఈ మహమ్మారి రైతులను కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. కరోనా ప్రభావం వల్ల ఏదైనా పని చేద్దామంటే పని దొరకని పరిస్థితి. పోనీ వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడులు ఎక్కువ... లాభాలు తక్కువ దీంతో వ్యవసాయం భారంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లోనే కొందరు ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడులతో వ్యవసాయ పనులు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో నాగరాజు అనే వ్యక్తికి వ్యవసాయం చేయడానికి ఎద్దులు లేవు.అలాగే ట్రాక్టర్ పెట్టి పొలం పనులు చేయించే అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ క్రమంలోనే సైకిల్ తో వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సైకిల్ కి కర్ర బిగించి
తాను లాగుతూ.. ఏడో తరగతి చదువుతోన్న తన కుమారుడితో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
ఈ విధంగా సైకిల్ ద్వారా వ్యవసాయ పనులు చేయడానికి గల కారణం ఏంటని ఆ రైతును అడగగా.. గత ఏడాది పంట వేసి పూర్తి నష్టాలను ఎదుర్కొనీ అప్పుల పాలయ్యాను. కనుక ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులను చేయించడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఈ విధంగా సైకిల్ ద్వారా వ్యవసాయ పనులను చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అధిక మొత్తంలో ఉండటంతో ట్రాక్టర్ యజమానులు సైతం ఎక్కువగా డబ్బులను డిమాండ్ చేయడంతో ఈ విధంగా సైకిల్ ద్వారా తన పనులను చేయాల్సి వస్తోందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Share your comments