News

రైతులకు తీపికబురు.. ఇకపై పీఎం కిసాన్ డబ్బులు 4000 లకు పెంచే అవకాశం..!

KJ Staff
KJ Staff

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న అతి ముఖ్యమైన పథకం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మూడు విడతల్లో ఒక్కొక్కసారి 2 వేల చొప్పున 6 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తోన్న విషయం తెలిసిందే.

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో వ్యవసాయంలో వారికి తోడుగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి 6000 రూపాయల నుండి 12000 రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఒక విడతలో ఇస్తున్న 2000 రూపాయలు కాస్త ఇకపై 4000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ డబ్బులను రెట్టింపు చేయాలని బీహార్ వ్యవసాయశాఖ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లు మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే దేశంలోని అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 8 విడతల్లో 16 వేల రూపాయలను పెట్టుబడి సాయంగా పొందారు.
తాజాగా 9.75 కోట్ల మంది రైతులకు19,500 కోట్ల రూపాయలను తొమ్మిదో విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను రెట్టింపు చేసే విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Share your comments

Subscribe Magazine