రైతులకు పశువులు తప్పనిసరిగా ఉంటాయి. పోలంతో పాటు పశువుల పాల ద్వారా ఆదాయం వస్తూ ఉంటుంది. ఒక్కోక్కసారి పంటకు నష్టం జరిగి దిగుబడి రాకపోయినా.. పాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అందుకే ప్రతి రైతుకు పశువులు తప్పనిసరిగా ఉంటాయి. ప్రస్తుతం పశువుల పెంపకం ద్వారా లక్షలు సంపాదించే రైతులు కూడా ఉన్నారు. ఒక్కోక్కసారి వీటి పాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుంది.
అయితే తాజాగా పాడి రైతులకు కరీంనగర్ డెయిరీ శుభవార్త తెలిపింది.పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌పై రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో Karimnagar Milk Producer Company Limited (KMPCL) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశంలో పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం లీటర్ పాలపై రూ.4 ప్రోత్సాహకం ఇస్తుంది. దానితో సంబంధం లేకుండా మరో రూ.1 ప్రోత్సాహాకం ఇవ్వనున్నట్లు కరీంనగర్ డెయిరీ ప్రకటించింది. మార్చి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ప్రస్తుతం 6 శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటర్‌కు రూ.37.20 ఉన్నాయి. రూ.2 పెంపుతో అది రూ.39.40కి చేరుకుంది. ఇక వెన్న 7 శాతం ఉన్న పాల ధర రూ.43.49 ఉండగా.. అది ఇప్పుడు రూ.45.80కి చేరుకుంది. ఇక వెన్న శాతం 10 ఉన్న లీటర్ పాల ధర రూ.62 ఉండగా.. ఇప్పుడు అది రూ.65కి చేరుకుంది.
ఇక ఆవు పాలు విషయానికొస్తే.. 4 శాతం వెన్న ఉన్న లీటర్ పాల ధర రూ.30.63 ఉండగా.. ఇప్పుడు అది రూ.33.13కి చేరుకుంది. ఇక వెన్న శాతం 4.5 శాతం ఉంటే రూ.31.85 నుంచి రూ.34.41కి చేరుకుంది. ఇక 5 శాతంకు చెల్లిస్తున్న రూ. 33.08 నుంచి రూ. 35.70కి పెంచుతున్నట్లు వెల్లడించింది.
Share your comments