News

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

KJ Staff
KJ Staff

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 24 గంటల్లోనే డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేయగానే 24 గంటల్లో డబ్బులు జమ చేసేందుకు రూ.26 వేల కోట్లను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసి ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారులకు హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోతే అధికారులే బాధ్యత తీసుకోవాలని హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్ధిపేట కలెక్టరేట్ నుంచి అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మిల్లుల్లో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలని హరీశ్ రావు పేర్కొన్నారు. టార్పలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యం విక్రయిస్తే డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిసేది కాదు.. ఒక్కొక్కసారి నెల రోజులు పడేది. ఎప్పుడు పడతాయో తెలియక రైతులు రోజూ బ్యాంకులకు వెళ్లి అడగాల్సి వచ్చేది. 24 గంటల్లో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రైతుల నుంచి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర కల్పిస్తోంది. దళారులకు అమ్మిన నష్టపోకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది.

Share your comments

Subscribe Magazine