News

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

KJ Staff
KJ Staff

మొక్కజొన్న రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయనుంది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటి ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలుకు అధికారులు శ్రీకారం చుట్టారు.

మార్కెట్‌లో మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,450 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. దళారులకు అమ్మి రైతులు నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.1,850 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 1500కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తామే మొక్కజొన్న పంటలను కొంటామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులకు కాస్త ఊరట లభించింది.

ఈ ఏడాది రబీలో 1.76 లక్షల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న పంట పండించారు. మొత్తం 14.33 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొక్కజొన్న పంటలను కోళ్ల ఫారాల్లో మేతగా ఉపయోగిస్తారు. కానీ కరోనా వల్ల పాల్ట్రీ రంగం దెబ్బతినడంతో.. మొక్కజొన్న డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధర బాగా తగ్గిపోవడంతో.. రైతులకు నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి ప్రభుత్వం పంటను కొనుగోలు చేసింది.

ఇటు తెలంగాణలో కూడా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వరి, పత్తి పంటతో పాటు అన్ని పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. రైతుల పంటలకు మద్దతు ధర లభించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Related Topics

mokkajonna, ap, farmers

Share your comments

Subscribe Magazine