News

పీఎం కిసాన్ ఎందుకు?.. ఎలా అప్లై చేసుకోవాలి?

KJ Staff
KJ Staff
How to apply for Pradhan Mantri Kisan Samman Nidhi Scheme
How to apply for Pradhan Mantri Kisan Samman Nidhi Scheme

దేశమంటే మట్టికాదోయి..దేశమంటే మనుషులోయి అని మ‌హాకవి గుర‌జాడ అప్పారావు పలికిన మాటలు మనందరిలో ఎప్పటికీ స్పూర్తిని రగిలిస్తూ ఉంటాయి. మరి మనుషులు జీవించాలంటే తినడానికి తిండి కావాలి. తిండి దొరక్క చనిపోతున్న వాళ్లు ఇప్పటికీ దేశంలో ఎంతోమంది ఉన్నారు. మరి తిండి దొరకాలంటే పండించేవాడు కావాలి. ఆ పండించేవాడే రైతు. రైతు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎండ, వాన, తుఫాన్ అనే తేడా లేకుండా దేశంలో నిరంతరం కష్టించే ఒకే ఒక మనిషి రైతు. అందుకే  రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు లేకపోతే ఆహారమే లేదు. అందువల్లనే దేశానికి రైతు వెన్నెముక అని అంటారు.

దేశానికి వెన్నెముక లాంటి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచే అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సబ్సిడీ ధరలపై విత్తనాలు, ఎరువులు అందించడం, సున్నా వడ్డీకే లోన్లు అందించడం లాంటివి ప్రభుత్వాలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా రైతులకు నగదు రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నాయి.

అలాంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకం ఒకటి.

పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి?

ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా నాలుగు నెలలకు ఒకసారి ఈ నగదును జమ చేస్తారు. 2019 ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ఈ పథకాన్ని పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో ప్రకటించారు. 2019, డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.  2018-19లో ఈ పథకం కోసం రూ.20 వేల కోట్లు కేటాయించగా.. 2019-20 సంవత్సరానికి రూ.87 వేల కోట్లు కేటాయించారు. మొత్తం రూ.14.5 కోట్ల రైతులు ఈ పథకం ద్వారా ప్రస్తుతం లబ్ధి పొందుతున్నారు.

పీఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి?

తహసీల్ధార్ ఆఫీసులో పీఎం కిసాన్ నోడల్ అధికారిని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు.
లేకపోతే www.pmkisan.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లి నేరుగా అప్లై చేసుకోవచ్చు

ఈ పథకానికి అర్హతలు ఏమిటి?

-భూమికి యజమాని అయి ఉండాలి. కౌలు రైతులకు వర్తించదు

-ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి

-దేశ పౌరులై ఉండాలి

ఎలాంటి పత్రాలు కావాలి?

-పౌరసత్వ ధృవీకరణ పత్రం

-భూమికి సంబంధించిన పత్రాలు

-ఆధార్ కార్డు

-బ్యాంక్ అకౌంట్ వివరాలు

గతంలో ఈ పథకం ఐదు ఎకరాలలోపు పోలం ఉన్నవారికి మాత్రమే వర్తించేది. కానీ ఐదు ఎకరాలకుపైన పోలం ఉన్న రైతులకు కూడా ఈ పథకం వర్తింపచేయాలని గత ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏది ఏమైనా రైతులందరూ బాగుండాలి. రైతే రాజు.. జై కిసాన్

Share your comments

Subscribe Magazine