News

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన హాప్ షూట్స్.. ఈ ఖరీదైన పంటను మీరూ ఇలా పండిచవచ్చు..

KJ Staff
KJ Staff
ఈ ఖరీదైన పంటను మీరూ ఇలా పండిచవచ్చు..
ఈ ఖరీదైన పంటను మీరూ ఇలా పండిచవచ్చు..

సాధారణంగా మనం కూరగాయలు పండిస్తాం.. మార్కెట్లో కొనుక్కొని వండుకుంటాం కూడా.. కానీ వాటి ధర పదుల్లో, మహా అయితే వందల్లో ఉంటుంది. కానీ లక్షల్లో ధర పలికే కూరగాయల గురించి మీకు తెలుసా?

బిహార్ కి చెందిన ఓ రైతు ఇలాంటి పంటనే పడించి ఒక్కో కిలో లక్ష రూపాయల చొప్పున అమ్మి మంచి లాభాలను పొందాడు అని తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అది అబద్ధమని ఆ తర్వాత తెలిసినా ప్రస్తుతం ఈ హాప్ షూట్స్ పంట మాత్రం ఫేమస్ గా మారిపోయింది. బిహార్ రైతు పండించడం అబద్ధమేమో కానీ హాప్ షూట్స్ పంటకు కిలోకి రూ. 5000 వరకు ధర మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. ఇప్పుడిప్పుడే దీన్ని భారత్ లోనూ చాలామంది పెంచుతున్నారు. అసలు దీనికి ఎందుకు అంత ఖరీదు? ఎలా పండించాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హాప్ షూట్స్ ప్రత్యేకత ఇదే..

హాప్ షూట్స్ అనేవి ఆకుపచ్చ రంగుల్లో కోన్ షేప్ లో ఉండే పూలు.. కన్నాబిస్ అనే గంజాయి కుటుంబానికి చెందిన పంట ఇది. ఇది ఉత్తర అమెరికాలో పుట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పంట సాగవుతోంది. గంజాయి కుటుంబానికి చెందింది కావడంతో గతంలో దీన్ని పండించేవారు కాదు. రైతులు కూడా దీన్ని పిచ్చి మొక్కగా పరిగణించేవారు. కానీ ఇందులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని.. ఎన్నో రకాల సూక్ష్మ జీవులను చంపే శక్తి దీనికి ఉందని తెలిసిన తర్వాత దీన్ని మందులు, ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ హాప్ షూట్స్ ఉపయోగించిన తర్వాత కేవలం ఈస్ట్ మాత్రమే పెరుగుతుంది. అందుకే దీన్ని బీర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దీనివల్లనే బీర్ కి ఆ చేదు రుచి వస్తుంది. కేవలం పూలు మాత్రమే కాదు.. పండ్లు, కాండం వంటివి కూడా బీర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇందులోని ఎన్నో మంచి గుణాల వల్ల యాంటీబయోటిక్స్ తయారీలో కూడా దీన్ని ఉపయోగించవచ్చని గుర్తించి మందుల తయారీలో కూడా వాడుతున్నారు. ఈ మొక్క కాండం నుంచి తయారయ్యే మందులు టీబీని తగ్గించడంలోనూ ఉపయోగపడుతాయి.

ఈ మొక్కలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. హాప్ కోన్స్ అని పిలిచే ఈ పూలను బీర్ తయారీలో వాడతారు. ఈ మొక్క లేత కాండాలను మందుల తయారీలో వాడతారు. చాలామంది వీటిని సలాడ్లు, కూరల్లో వేసుకొని తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ మెక్కల్లో హుములోన్స్, లుపులోన్స్ అనే రెండు యాసిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా విరుగుడుగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మ సమస్యల నుంచి కూడా ఇవి కాపాడతాయి.

ఎలా పెంచాలంటే..

హాప్ షూట్స్ పెంచేందుకు సరైన సమయం మార్చి, ఏప్రిల్ నెలలే.. ఒక్కసారి నాటితే సన్నని తీగలాంటి కొమ్మలు చాలా పుట్టుకొస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే చాలా పెద్దగా పెరిగిపోతాయి. అయితే మరీ కింద వరకు కట్ చేయడం వల్ల కాండం దెబ్బతింటుంది. వీటిని నాటుకోవడానికి ముందే ద్రాక్ష తోటలకు కట్టినట్లుగా తీగలు కట్టేందుకు పోల్స్, తీగలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు లేదా రెండున్నర అడుగుల గ్యాప్ వదిలేసి మొక్కలను నాటుకోవాలి. వీటికి చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం అవుతాయి. అందుకే గ్రీన్ హౌస్ లలో పెంచుకోవడం సరైన పద్ధతి. అయితే వాతావరణం పొడిగా ఉండాలి కాబట్టి వేసవిలోనే వీటిని పెంచుకోవాలి. ఈ మొక్కలు ఎంత తక్కువ ఉష్ణోగ్రతనైనా తట్టుకోగలుగుతాయి. ఈ మొక్కల వేళ్లు చాలా చిన్నగా పైపైనే ఉంటాయి. కాబట్టి నీటి లభ్యత కూడా ఎక్కువగానే ఉండాలి. అందుకే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం నీళ్లు కూడా పూర్తిగా మొక్క పై పడకుండా మొక్కకు రెండు వైపులా పడేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మొక్క చుట్టూ తడిదనం ఉండడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది. ప్రతి వారం రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది. అందుకే ఇది బాగా పెరిగేలా పైకి కంచెను ఏర్పాటు చేస్తూ అప్పుడప్పుడూ ప్రూనింగ్ కూడా చేస్తుండాలి. నత్రజని ఎక్కువగా ఉన్న ఎరువులు వేయడం వల్ల పంట పచ్చగా ఉంటుంది. అలాగే ఫాస్పరస్, పొటాషియం కూడా ఎక్కువగానే చల్లాల్సి ఉంటుంది. నత్రజని వేసిన మొత్తానికి రెట్టింపు ఫాస్పరస్ వేయాల్సి ఉంటుంది. ఇక ఈ పంటలో ఎక్కువగా వచ్చే సమస్యలైన ఎఫిడ్స్, స్పైడర్ మైట్స్ రాకుండా ఉండేందుకు వేపనూనె, సబ్బు కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లగా ఫంగస్ కనిపించగానే సల్ఫర్, కాపర్ ఎక్కువగా ఉండే ఫంగిసైడ్స్ చల్లుకోవాలి. పంట దిగుబడి బాగా వస్తే ఎక్కువ లాభాలను పొందే వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine