News

అక్కడ వర్షాకాలంలో వజ్రాల పంటలు పండుతాయి.. ఎక్కడంటే?

KJ Staff
KJ Staff

ఆ గ్రామంలో వర్షం పడిందంటే చాలు వజ్రాల పంటలు పండుతాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామంలోని కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతుంటారు. వర్షాకాలం మొదలైతే కేవలం ఆ గ్రామంలోని ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా ఆ గ్రామంలోని పొలాల వెంట వజ్రాల వేటలో నిమగ్నమవుతారు. ఇంతకీ ఆ గ్రామం ఏదటంటే.. అది ఒకప్పుడు శ్రీ కృష్ణ రాయలు ఏలిన రాయలసీమలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతం. ఈ గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది రైతులు కోటీశ్వరులు అవుతారు.

ఈ జొన్నగిరి ప్రాంతంలో ప్రతి ఏడాది వర్షాకాలంలో చాలా మంది రైతులకు వజ్రాలు దొరుకుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొందరు ఆ గ్రామానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వజ్రాల వేటలో నిమగ్నమవుతారు. ఈ విధంగా అక్కడ లభించే వజ్రాలను కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడతారు. ఇలా వజ్రాలు దొరుకడంతో ఆ గ్రామంలోని చాలా మంది కోటీశ్వరులుగా మారిపోతారు.

తాజాగా జొన్నగిరి ప్రాంతంలో ఓ మహిళ టమోటా నాటుతుండగా మహిళకు అదృష్టం వజ్రం రూపంలో లభించింది. అదే విధంగా మరో వ్యక్తికి 30 లక్షల విలువ చేసే వజ్రం లభించడంతో చాలామంది వజ్రాల వేటలో పడ్డారు. అదేవిధంగా ఈ ఏడాది మే నెలలో ఓ వ్యక్తికి ఏకంగా 30 క్యారెట్ల వజ్రం దొరకడంతో స్థానిక వ్యాపారులు ఆ వజ్రాన్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాన్ని వ్యాపారులు కోటి 20 లక్షలకు దక్కించుకున్నారు. ఈ విధంగా వర్షాకాలం వస్తే జొన్నగిరి గ్రామంలో వజ్రాలు పండుతాయని భావిస్తారు.

Share your comments

Subscribe Magazine