ఆధునిక వ్యవసాయంలో మల్చింగ్ షీటు ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతితో పోలిస్తే మల్చింగ్ షీటు పరచిన పొలంలో మొక్కలు ఎరువుల్ని పూర్తి స్థాయిలో వినియోగించడమే కాకుండా కలుపు మొక్కల సమస్యను, నీటి ఎద్దడిని సమర్థవంతంగా నివారించవచ్చు.ముఖ్యంగా ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలైన మిరప, టమాటా, కాప్సికమ్, కర్బూజ మరియు వివిధ రకాల పూల తోటలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం మల్చింగ్ షీట్
ఏర్పాటు చేసుకోవాలంటే కూలీలు దొరకడం ప్రధాన సమస్యగా మారుతోంది. అలాగే రైతులకు కొంత ఆర్థిక భారం తప్పలేదు.
సాధారణంగా ఎత్తు మడులపై మల్చింగ్ షీట్
పరచడానికి ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగించి ఎకరానికి దాదాపు 8 మంది కూలీలతో రోజు మొత్తం కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి నాసిక్‌కు చెందిన యువ రైతు నితిన్ ఘలే పాటిల్ సులువుగా,తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని
రూపొందించాడు.ఈ పరికరాన్ని ఉపయోగించి
ఎకరా పొలాన్ని సునాయాసంగా ఇద్దరు మనుషులు 8 గంటల్లోనే మల్చింగ్ షీట్‌ను పరచడం పూర్తి చేసేయొచ్చు.
తమ ప్రాంతంలో కూలీల కొరత సమస్య అధికంగా ఉండటంతో యువరైతు నితిన్ ఘలే తన ఆలోచనలకు పదును పెట్టి అందుబాటులో ఉన్న పాత ఇనుప వస్తువులను ఉపయోగించి 15 రోజులు కష్టపడి ట్రాక్టర్ అవసరం లేకుండా మనుషులు సహాయంతో మల్చింగ్ షీట్ పరిచే పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు.దీని పనితీరు అద్భుతంగా ఉండడంతో చాలామంది రైతు సోదరులు ఈ పరికరాన్ని తయారు చేయించుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుండటంతో నితిన్ ఈ పరికరాన్ని పది వేల రూపాయలకు తయారుచేసి ఇస్తున్నాడు.మల్చింగ్ షీట్ పరిచే పరికరం కావలసినవారు మరింత సమాచారం తెలుసుకోవాలంటే యువ రైతు నితిన్ ఘలే 98909 82432 నెంబర్ కు సంప్రదించవచ్చు.
Share your comments