News

తెలంగాణ రైతులు ఆ మూడు పంటలే పండించాలట..

KJ Staff
KJ Staff

తెలంగాణ ప్రభుత్వం గతంలో నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే వేయాలని, డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని రైతులకు సూచించింది. జిల్లాల వారీగా ఏ ఏ పంటలు బాగా పండుతాయి. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి. ఏది వేస్తే అధిక దిగుబడి వస్తుందనే దానిపై లోతుగా విశ్లేషణ చేసి నూతన వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నియంత్రణ సాగు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

వేసిన పంటనే మళ్లీ వేయడం వల్ల లాభం ఉండదని, పంట మార్పిడి చేస్తే అధిక లాభాలు ఉంటాయని నూతన వ్యవసాయ విధానంలో ప్రభుత్వం పేర్కొంది. ఇక తాము చెప్పిన పంటలను వేస్తేనే రైతు బంధు వర్తిస్తుందని ప్రభుత్వం ముడిపెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ రైతులకు దిక్కుతోచని స్థితిలో రైతుబంధు రాదనే భయంతో ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే వేస్తున్నారు.

వానాకాలంలో ఏ ఏ పంటలు వేయాలి?

వానాకాలంలో పత్తి 70 లక్షల ఎకరాల్లో, వరి 40 లక్షల ఎకరాల్లో , కందులు 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక వానాకాలంలో మక్క సాగు వద్దని ప్రభుత్వం చెప్పింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల్లో పసుపు వేసుకోవచ్చని, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో రెండున్నర లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగుకు అనుమతి ఉందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ క్రమంలో తాజాగా మరోసారి రైతులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది కంది, వేరుశనగ, పత్తి పంటలను అధికంగా పండించాలని సూచించారు. వానాకాలంలో సన్నరకాల వరి సాగును పెంచాలని, దొడ్డు రకం వడ్ల సాగును తగ్గించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. దొడ్డు రకం వడ్ల వినియోగం కన్నా ఉత్పత్తి అధికంగా ఉంది. దొడ్డురకాలు మరింత సాగు పెరిగితే రైతులు నష్టపోయే అవకాశముందన్నారు.

తెలంగాణలో పంటల సాగులో మార్పులు రావాలని, భవిష్యత్తులో కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్నారు. నూతన వ్యవసాయ పాలసీ వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఇది మంచి పరిణామమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో పత్తి 54 లక్షల ఎకరాల్లో సాగు అయ్యేది ఇప్పుడు 61 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

తెలంగాణలో పత్తి సాగును రైతులు ఇంకా పెంచాల్సిన అవసరముందని, పత్తి నాణ్యతలో దేశంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. ఇక దిగుబడి రెండో స్థానంలో ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక కంది సాగును రైతులు పెంచారని, ప్రభుత్వ మద్దతు ధర కంటే అధిక ధర బహిరంగ మార్కెట్‌లో లభించిందని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Share your comments

Subscribe Magazine