సాధారణంగా రాయలసీమ అంటేనే కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందని చెప్పవచ్చు.ఇక్కడ వ్యవసాయం సాగు చేయాలంటే నీటి కొరత కారణంగా రైతులు కష్టాలు ఎదుర్కొని చివరకు వ్యవసాయాన్ని వదిలేసి ఉపాధి పనుల కోసం ఇతర పట్టణాలకు వలసలు వెళుతుంటారు.ఈ విధమైనటువంటి కరువు ప్రాంతాలకు చిత్తూరు జిల్లా పడమటి మండలాలకి నిలయం అని చెప్పవచ్చు. అయితే ఈ గ్రామాలలో వ్యవసాయమే దండగ అనుకున్న రైతులను మార్చి వారితో పంటలను సాగు చేయించి ఆ ప్రాంతాలను కరువు నుంచి తరిమికొట్టారు పారేశమ్మ.
రైతులు ఎంతో నిరాశ చెంది సాగు బరువని అనుకున్న ప్రాంతాలలో సిరులు కురిపిస్తున్నారు.బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తించారు. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసి.. రైతుల్లో చైతన్యం నింపారు. ఈమె చైతన్యంతో నేడు 16 గ్రామాలలో భూములు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈమె రైతులలో నింపిన స్ఫూర్తికి ఐక్యరాజ్యసమితి ఈమెను ప్రశంసించింది.
తంబళ్లపల్లె సమీపంలోని గోపిదిన్నె పారేశమ్మ స్వస్ధలం. పదవ తరగతి చదివి ఐటీ పూర్తి చేసిన ఈమె చిన్న చిన్న ఉద్యోగాలు చేసేది. తరువాత ఫౌండేషన్ ఫర్ ఎకొలాజికల్ సెక్యూరిటీ సంస్థలో చేరారు. పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో సంస్థ కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించడం ఈమె విధి. ఈ క్రమంలోనే తంబళ్లపల్లె మండలంలో గల 16 పంచాయతీలు కేటాయించారు. నూతన సాగు విధానాలు, రైతులకు తెలియజేసేవారు.చుక్క నీరు లేని ఆ భూములలో వ్యవసాయం చేయాలంటే రైతులు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఈమె ప్రోత్సాహం ప్రోద్బలం వల్ల రైతులను వ్యవసాయం వైపు మళ్ళించారు.
ఉపాధి హామీ పనులలో భాగంగా వారి పొలాలు ఉన్న ప్రాంతాలలో నీటి కుంటలు, చిన్న చెరువులను నిర్మించుకునే విధంగా రైతులలో ప్రోత్సాహం నింపారు. నీటి అవసరం అధికంగా ఉండే టమోటా వంటి పంటలకు బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వేరుశనగ పంట వంటి వాటిపై ఈమె రైతులకు అవగాహన కల్పించారు. దీంతో పంటకు నీటి అవసరం తగ్గినప్పటికీ పంట దిగుబడి బాగా పెరిగింది.అదేవిధంగా నీటి కుంటలు సహాయం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో ఈ ఐదు సంవత్సరాలలో 16 మండలాలలోని బీడు భూములు నేడు పచ్చహారాన్ని తొడిగాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ మండలంలో 16 గ్రామాలలో పచ్చదనం కనిపిస్తుంది అంటే దాని వెనక పారేశమ్మ కష్టం ఉంది.పారేశమ్మ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి... ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డు ప్రదానం చేసింది.
Share your comments