News

బతికుండగానే రైతు బీమా.. బయటపడిన అవినీతి అధికారుల బాగోతం..?

KJ Staff
KJ Staff

రైతు దేశానికి వెన్నెముక రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భీమా పథకంలో భాగంగా రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ఐదు లక్షలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు అధికారులు ఐదు లక్షల కోసం ఆశపడి దేశానికి అన్నం పెట్టే రైతులని బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించే దారుణ పరిస్థితులకు దిగజారుతున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన రైతుబంధు పథకం అమలులో భాగంగా అవినీతి పరుల బాగోతం బయటపడింది.అసలు వివరాల్లోకి వెళితే. తెలంగాణ రాష్ట్రం ,వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే రైతు బతికుండగానే ఏడాదిక్రితమే చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్, మరో అధికార పార్టీ నేతతో పాటు అధికారులు కక్కుర్తిపడి రైతు బీమా సొమ్మును కాజేశారు.

స్థానిక టిఆర్ఎస్ నేత కొందరు అధికారులు కలిసి చంద్రమ్మ గత సంవత్సరం సెప్టెంబర్ 20న చనిపోయినట్టు గ్రామపంచాయితీ నుండి నకిలీ సర్టిఫికెట్ సృష్టించి చంద్రమ్మ కొడుకుతోనే అతనికి తెలియకుండా స్థానిక ఏవో వద్ద రైతభీమా డబ్బుల కోసం ధరఖాస్తు చేయించాడు. అయితే ఈ దరఖాస్తు పై తగిన విచారణ చేయకుండానే బీమా సొమ్మును మంజూరు చేసి చంద్రమ్మ కొడుకు అకౌంట్లో వేశారు. ఆ సొమ్మును ఎలాగోలాగ వారి వారి అకౌంట్లోకి మార్చు కున్నారు అంతవరకు బాగానే ఉంది.ఇటివల రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయడంతో రైతు చంద్రమ్మ మరణించినట్లు ధృవీకరించారు కాబట్టి ఆమెకు రైతుబంధు నిధులు అందలేదు. ఈ విషయం తెలియని చంద్రమ్మ కొడుకు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి కంగుతిన్న అధికారులు బాధ్యులపై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Share your comments

Subscribe Magazine