భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగంలో రోజురోజుకు ఆధునికత సంతరించుకుంటుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో సోలికల్చర్ విధానం అమల్లోకి రాబోతోంది. సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నీడలో వివిధ రకాల పంటలను సాగుచేసే విధానాన్నే సోలికల్చర్ అని అంటారు.సోలి కల్చర్ సాగు విధానంలో వివిధ రకాల పంటలను ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో ఈసాగు విధానం అమలులో ఉండి సత్ఫలితాలు పొందుతోంది.
రానున్న కాలంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి సోలార్ విద్యుత్ పై ఎక్కువ మొత్తంలో ఆధారపడాల్సి వస్తుంది. కావున లక్షలాది ఎకరాల్లో సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేయవలసి వస్తోంది.భూములను సద్వినియోగం చేసేందుకు సోలికల్చర్ సాగు విధానం తప్పనిసరి. ఈ విధానంలో రైతులు తమ పొలంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, సోలార్ ప్యానల్ కింద వ్యవసాయం చేసుకోవచ్చు. సోలి కల్చర్ సాగు విధానంలో భవిష్యత్తులో విద్యుత్ కొరతను, ఆహార కొరతను అధిగమించవచ్చునని కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు
సాధారణంగా సోలార్ ప్యానల్ కింద నీడ ఎక్కువగా ఉంటుంది. సోలార్ ప్యానల్ నుంచి కిందకు కాంతి ప్రసారమయ్యే కొత్త రకం ప్యానల్ తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా దేశంలోనే తొలిసారిగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంకుర సంస్థ సోలి కల్చర్ సాగు విధానంలో పంటలు పండించి దిగుబడులు సాధించడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగం సఫలం అయితే రైతులకు మరింత మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Share your comments