రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి జగడం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మొండిగా ప్రవర్తించి శ్రీశైలంలోని నీటిని తమ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవడంతో రాయలసీమ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. శ్రీశైలంలోని నీలం సంజీవరెడ్డి జలాశయంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవడం వల్ల నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది.
ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మొండి పట్టుదల వల్ల శ్రీశైలంలోని మిగులు జలాల ద్వారా రాయలసీమలో పలు ప్రాజెక్టులకు అందించే సాగునీరు లేకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. సరైన సమయానికి సాగునీరు అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పొలంలో ఎండిపోయిన పంటలను దున్నేస్తూ అధిక నష్టాలను చవి చూస్తున్నారు.
ఒకవైపు వర్షాలు పడక పోవడమే కాకుండా మరొకవైపు శ్రీశైలం మిగులు జలాలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపకపోతే మరో వారంలో శ్రీశైలం నీటిమట్టం 800 అడుగులకు పడిపోతుంది.ఇదే కనుక జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు రావాల్సిన నీరు ఇప్పుడే రావని తెలుస్తోంది.ఈ క్రమంలోనే శ్రీశైలం డ్యామ్ కు వరద ఉధృతి పెరిగినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.వరద ఉధృతి తగ్గి పోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపక పోవడంతో డ్యామ్ లోని నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విధంగా శ్రీశైలం మిగులు జలాలు రాక వర్షాలు పడకపోవడంతో కర్నూలు ప్రాంతంలోని రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
Share your comments