News

ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు

KJ Staff
KJ Staff

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటన చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంబంధించి వేసవి సెలవులు నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి సబితా స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తామనేది జూన్ 1న నిర్ణయిస్తామన్నారు. కరోనా పరిస్థితులను అనుసరించి విద్యాసంస్థలు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో 10, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు ఇస్తామని తెలిపింది.

Share your comments

Subscribe Magazine