ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులు, పంటలు పండక, వ్యవసాయ నష్టాలను చవిచూసి తమ జీవితాలను అర్దాంతరంగ ముగించుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టు(TELANGANA HIGHCOURT) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయంలో నష్టపోయి తీవ్ర అస్వస్థతకు గురైన 133 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మోహిన్‌పురానికి చెందిన సామాజిక కార్యకర్త బి.కొండల్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా ఇతర అన్ని జిల్లాల్లో నష్ట పరిహారం అందజేత పూర్తయినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే 133 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే 12 మంది రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇంకా సాయం అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.మిగతా రైతు కుటుంబాలకు సైతం నష్ట పరిహారం చెల్లించి వివరాలు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల చేయడంలో జరిగిన విపరీతమైన జాప్యాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు స్వయంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది.
మరిన్ని చదవండి.
Share your comments