News

రైతు రుణమాఫీపై బ్యాంకులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

KJ Staff
KJ Staff
telangana farmers
telangana farmers

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆగిపోయిన రైతురుణమాఫీ పథకాన్ని త్వరలో మళ్లీ అమలు చేయనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతురుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని ఇటీవల కేబినెట్ లో నిర్ణయించింది. గతంలో రూ.25 వేల లోపు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత కరోనా రావడం, లాక్ డౌన్ వంటి పరిస్థితుల వల్ల రుణమాఫీ తదుపరి ప్రక్రియను ఆపివేసింది. ఇప్పడు మళ్లీ రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

రూ.50 వేల లోపు రుణాలు ఉన్న రైతులకు పూర్తిగా మాఫీ చేయాలని ఇటీవల కేబినెట్ లో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆగస్టు 16 నుంచి రైతుల అకౌంట్లలో రూ.50 వేల నగదును నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రక్రియ మొదలైంది. 6 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి చేకూరనుండగా.. రుణమాఫీ కింద రూ.2,600 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.

రుణమాఫీ జమ విషయమై తాజాగా బ్యాంకర్లతో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. రుణమాఫీ నగదు జమపై చర్చించారు. రుణమాఫీ అకౌంట్లలోనే డబ్బులు జమ చేయాలని, ఇతర ఖాతా కింద జమ చేయవద్దని మంత్రులు సూచించారు. 42 బ్యాంకులకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 16 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు.

గతంలో రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయగా.. 3 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు. ఆగస్టు 16 నుంచి రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేయనుండటం వల్ల 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో మొత్తం ఇప్పటివరకు 9 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక రుణమాఫీ ప్రక్రియను దశలవారీగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Share your comments

Subscribe Magazine