Agripedia

టేకు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు...!

KJ Staff
KJ Staff

నాణ్యమైన, దృఢమైన, అతి ఖరీదైన కలప నిచ్చే మొక్కల్లో టేకు మొక్కలకు అధిక ప్రాముఖ్యత కలదు.మన తెలుగు రాష్ట్రంలో టేకు మొక్కల పెంపకానికి అన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉండడంతో చాలామంది రైతులు టేకు మొక్కలను ప్రధాన పంట గాను,పొలంగట్ల వెంబడి పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టేకు మొక్కలను సాధారణంగా విత్తనాలు లేదా పిలకల నుండి సహజ పునరుత్పత్తి చేయవచ్చు.లేదా టిష్యూకల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం టిష్యూకల్చర్ టేకు మొక్కలకు మార్కెట్లో మంచి గిరాకీ కలదు.

టేకు మొక్కలు నీటి ముంపుకు గురికాని అన్ని రకాల నేలల్లో సమృద్ధిగా పెరుగుతాయి. టేకు మొక్కల సాగులో మనం తీసుకునే యాజమాన్య పద్ధతులు,వాతావరణ పరిస్థితులను బట్టి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల్లో అధిక నాణ్యమైన కలప తయారవుతుంది.టేకు మొక్కల పెంపకంలో
తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీటి యాజమాన్యం: మొక్కలు నాటిన వెంటనే క్రమం తప్పకుండా వాతావరణ పరిస్థితులను, నేల స్వభావాన్ని బట్టి ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీరు పెట్టాలి.వర్షాలు లేనపుడు 20 రోజులకొకసారి నీరు ఇవ్వాలి.వేసవి కాలంలో 15 రోజుల కొకసారి నీరు ఇవ్వాలి. ఇలా కనీసం 2-3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీరు పెట్టవచ్చు.

అంతర కృషి, కలుపు నివారణ : ప్రధాన పొలంలో సరైన అంతరకృషి, కలుపు నివారణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం చెట్ల మధ్య లోతుగా దున్నాలి. పాదుల్లో కలుపు మొక్కలను దున్నిన తర్వాత మిగిలిన వాటిని తీసివేసి పాదులను బాగు చేయాలి.మొక్కలు నాటిన 2 నెలల తర్వాత 4 కిలోల పశువుల ఎరువు వేయాలి.

సస్యరక్షణ: టేకు మొక్కల్లో చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. వేరు పురుగు సమస్య ఉన్న నేలల్లో 2 చ.మీ.కు 1 టీ చెంచా కార్బోప్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును నివారించవచ్చు. ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళ మొక్కలకు ఆశించినట్లు అయితే లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ పిచికారీ చేసి తెగుళ్లను నివారించవచ్చు.

Share your comments

Subscribe Magazine