Agripedia

బీరకాయతో "స్క్రబ్బర్" తయారీ.... పర్యావరణానికి ఎంతో మేలైనది

KJ Staff
KJ Staff

ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏమి లేదు, కాస్త శ్రద్ధతో ఆలోచిస్తే వృధా అనుకున్న దానితో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తరహాలోనే ఈ మధ్య కాలంలో బీరకాయ పీచుతో చేసిన స్క్రాబ్బర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు బీరకాయ ఒక కాయగూరగానే మనందరికీ తెలుసు, కానీ ఈ మధ్య కాలంలో బీరకాయ నుండి తీసిన పీచు నుండి కూడా స్క్రబ్బర్ తయారుచెయ్యచ్చని కొంత మంది నిరూపిస్తున్నారు. ఇలా తయారుచేసిన స్క్రబ్బర్స్ వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

సాధారణంగా స్క్రబ్బర్స్, పాత్రలు శుభ్రం చేసుకోవడానికి, ఇంట్లోని టైల్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం, చాల మంది స్నానం చేసేటప్పుడు స్క్రబ్బర్స్ తో శరీరాన్ని శుభ్రంచేసుకుంటారు, ఇలా చెయ్యడం ద్వారా శరీరంపైనా పేరుకుపోయిన మట్టి, మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అయితే ఇటువంటి అవసరాలన్నిటికి ప్లాస్టిక్ తో తయారుచేసిన స్క్రబ్బర్స్ నే వాడుతూ వస్తున్నాం, వీటిని వాడిపడేసిన తరువాత భూమిలో కలవడానికి దాదాపు 100 ఏళ్ళు పడుతుంది. మన దేశంలో పూర్వం సామాన్లు శుభ్రం చెయ్యడానికి కొబ్బరి పీచు, గడ్డి వంటి వాటిని వినియోగించేవారు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇటువంటి సహజమైన స్క్రబ్బర్స్ కరువై, వాటి స్థానంలోకి స్టీల్ మరియు ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ వచ్చాయి.

ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ వలన పర్యావరణానికి జరుగుతున్న హానిని గుర్తించిన చాల దేశాలు వీటికి ప్రత్యామ్న్యాయ పద్దతులను అన్వేషిస్తూ, బీరకాయ పీచుతో స్క్రబ్బర్స్ తయారుచేసి వాటిని వినియోగించడం మొదలుపెట్టాయి. వీటిని తయారుచెయ్యడం కూడా చాల శులభం, మొదట బీరకాయలు ఎండిపోయే వరకు పాదు మీదే ఉంచి, తరువాత వాటిని కోసి, తర్వాత వాటిని ఒక 24 గంటలు పాటు నీటిలో నానబెట్టాలి. నీటిలో ఉంచడం వలన బీరకాయ పైన తొక్క సులభంగా తొలగిపోయి, కేవలం లోపలి పీచు భాగం మాత్రమే మిగులుతుంది.

ఇలా పైన తొక్క భాగం తీసేసిన తర్వాత లోపాలు గింజలను తొలగించాలి, దీని కోసం కాయలను గట్టిగ విదలిచినట్లైతే గింజలు బయటకు వచ్చేస్తాయి. ఈ గింజలను బీరకాయ విత్తనాలుగా మార్కెట్లో విక్రయించవచ్చు. చివరిగా మిగిలిన పీచు పదార్ధాన్ని వేడి నీటిలో కొంచెం సేపు ఉడకబెట్టాలి, ఇలా చెయ్యడం ద్వారా పీచులో ఉన్న బాక్టీరియా నశిస్తుంది అంతేకాకుండా, పీచు మెత్తబడి, స్క్రబ్బర్ తయారీకి అనువుగా మారుతుంది. ఇలా ఉడకబెట్టిన పీచులోని నీరంతా పోయేవరకు, ఆరబెట్టి, స్క్రబ్బర్ పరిమాణంలో కత్తిరించి, ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. బీరకాయ పీచు నుండి తయారుచేసిన స్క్రబ్బర్స్ ఎక్కువ కాలం మన్నుతాయని వీటిని తయారుచేసే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వీటివల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లదు.

Share your comments

Subscribe Magazine