Agripedia

వర్షాకాలం సీజన్లో అరటి సాగులో అధికంగా వ్యాపించి తెగుళ్లు, నివారణ చర్యలు...

KJ Staff
KJ Staff

మన రాష్ట్రంలో పండే అరటి పండ్లకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తూ దాదాపు 63.84 లక్షల టన్నుల అరటి ఉత్పత్తిని సాధిస్తూ దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాగుతోంది. అరటి వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కోవడంతో చాలా మంది రైతులు అరటి పంటను సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చాలా మంది రైతులు సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటించకపోవడంతో పంట దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారు.

అరటి సాగుకు సరాసరి 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనుకూలం.అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకులపై మచ్చలు ఏర్పడి, కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఎదుగుదల ఆగిపోతుంది. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల గెలల్లో ఎదుగదల ఆగిపోతుంది.తొలకరి వర్షాలు ప్రారంభం అయినప్పటి నుండి నవంబరు వరకు గాలిలో తేమశాతం పేరిగి 15 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్న సమయంలో సిగటోక ఆకుమచ్చ తెగులు, కాయముచ్చిక కుళ్ళు తెగుళ్లు ఆశించి అధికంగా నష్టపరిచే ప్రమాదం ఉన్నందున రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు అయితే అధిక నాణ్యమైన దిగుబడులు సాధించ వచ్చు.

సిగటోక ఆకుమచ్చ తెగులు: వర్షాకాలం గాలిలో తేమశాతం పెరగడం వల్ల అరటి ఆకులపై చిన్న మచ్చలు ప్రారంభమై, క్రమంగా పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగుకు మారి, ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.గెలలు తయారయ్యే సమయంలో ఈ తెగులు వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. తెగులును తట్టుకోలేని రకాలను జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య నాటడం ద్వారా తెగులు వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. తెగులు నివారణకు తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలి. నీరు నిలవకుండా చూడాలి. ఎక్కువగా ఉన్న పిలకలను తీసివేయాలి.వర్షాకాలం ప్రారంభానికి ముందు లీటరు నీటికి 2.5గ్రా. మాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి పిచికారి చేయాలి. వర్షాకాలంలో తెగులు వ్యాపిస్తే,వ్యాధి నివారణకు1.మి.లీ ఆజాక్సీ బీన్ లేదా 1.4 గ్రాములు ట్రైప్లాక్సిస్టోజీన్ లేదా 1మి.లీ సిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.

కాయ ముచ్చిక కుళ్ళు తెగులు: ఈ తెగులు ఎక్కువగా వర్షాకాలంలో పక్వానికి రాని కాయలపై వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళు మచ్చలు ఏర్పడతాయి. ముందుగా ఒకటి, రెండు కాయలపై లక్షణాలు కనిపించి, క్రమేపి మిగిలిన కాయలకు కూడా వ్యాపిస్తుంది.తెగులు ఆశించిన కాయలను గుర్తించి వెంటనే
చెట్టు నుంచి తొలగించి కాల్చివేయాలి. తర్వాత
లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపిన మిశ్రమాన్ని అరటి గెలలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే కాయ ముచ్చిక కుళ్ళు తెగులును నిర్మూలించ వచ్చు.

Share your comments

Subscribe Magazine